గీసుగొండ, ఫిబ్రవరి 28 : మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని, రోజూ సాంబార్, పప్పుతోనే భోజనం పెడుతున్నారని విద్యార్థులు వరంగల్ కలెక్టర్ సత్యశారదకు చెప్పుకొన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాక ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు.
ప్రభుత్వం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని చెబుతుంటే మీరేం చేస్తున్నారని హెచ్ఎంను మందలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలన్నారు. వంటలు వండే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇష్టారీతిన వంటలు చేసి పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రోజుకో కూరతో భోజనం పెట్టాలని ఆదేశించారు. ఇక్కడ డీఈవో జ్ఞానేశ్వర్, ఎంఈవో సత్యనారాయణ ఉన్నారు.