శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణం రమణీయంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఊరూరా వేడుకలు కనులపండువగా కొనసాగాయి. అభిజిత్ లగ్న సుముహూర్తాన వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు.. అశేష భక్తజనం సమక్షంలో వివాహ ఘట్టం అంగరంగవైభవంగా సాగింది.
ఈ సందర్భంగా పలు ఆలయాలు, ప్రధాన కూడళ్లు వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసిపోయాయి. పెళ్లి తంతును ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.