నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఈ సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన
అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నర్సంపేట రూరల్, జూన్ 12 : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు మొదటి రోజు పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కానుండడంతో బుక్స్, జనరల్ స్టోర్లు విద్యార్థుల తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే, జిల్లాలో ప్రభు త్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కస్తూర్బా గాంధీ, మోడల్, సాంఘిక సంక్షేమ, ఎస్టీ, పట్టణ బాలు ర, మైనార్టీ గురుకులాలు కలిపి మొత్తం జిల్లాలో 724 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు.
ప్రభుత్వ స్కూళ్లల్లో భారీగా విద్యార్థుల చేరిక
జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు బడిబాట నిర్వహించారు. బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడిబాటలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల చేరిక భారీగా పెరిగింది.
తరగతులు కొనసాగించాలి.. – వాసంతి, డీఈవో
నూతన విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారం భం కానుంది. ఈనెల 13 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయులు గత తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాలను విధిగా రివిజన్ చేయాలి. జూలై 1 నుంచి యథావిధిగా రెగ్యులర్ తరగతులు కొనసాగించాలి. విద్యార్థులకు బేసిక్స్, మానవతా విలువలపై అవగాహన కల్పించాలి. అంతేగాక ప్రతి పాఠశాలలో నూతన విద్యార్థుల ఎన్రోల్మెంట్ పక్కాగా చేయాలి.