మహబూబాబాద్ రూరల్, జూలై 9 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి కేసీఆర్‌పై బురద జల్లేందుకే యత్నిస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇలాంటి కుయుక్తులను వెంటనే మానుకొని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలకు ఆర్భాటంగా ఆరుగురు మంత్రులు వచ్చి గతంలో కేసీఆర్ మంజూరు చేసిన రోడ్లకే మళ్లీ శంకుస్థాపనలు చేశారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కోసమే హంగామా చేశారని దుయ్యబట్టారు. గతంలో మానుకోట జిల్లా అభివృద్ధికి మంత్రిగా తాను, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనేక నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని ల్యాప్స్ చేసిందని, తిరిగి వాటినే మంజూరు చేసి తమ గొప్పగా చెప్పుకొంటుందన్నారు.
గత పదేండ్లలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ పోతే చరిత్ర అవుతుందని, జిల్లాకు వచ్చిన మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు స్థానిక ప్రజాప్రతినిధులు రావాలని సవాల్ విసిరారు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్కకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవగాహన లేదని, ఇక్కడి రైతులు గోదావరి జలాలతోనే రెండు పంటలు పండించారన్నారు. మంత్రి పొంగులేటి ఏడాదిగా ఇందిరమ్మ ఇండ్లపైనే మాట్లాడుతున్నారని, ఇప్పటి వరకు ఎంతమందికి మంజూరు చేశారో, ఎంత డబ్బు వారి ఖాతాల్లో జమచేశారో చెప్పడం లేదన్నారు. భూభారతి పేరిట కాలయాపన చేస్తున్నారే తప్ప ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు.
మరో మంత్రి సీతక్క మొసలి కన్నీరు కారుస్తూ కేటీఆర్‌కు శాపనార్థాలు పెడుతున్నదని, ఆమె మంత్రి అయ్యాక ములుగు జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎంపీ నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సత్యవతి డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, నాయిని రంజిత్ కుమార్, యాళ్ల మురళీధర్ రెడ్డి, లునావత్ అశోక్ నాయక్, తేళ్ల శ్రీను, మహబూబ్‌పాషా, మార్నేని రఘు, బోడ లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం హామీలు మాత్రమే ఇచ్చారని, వాటిని ఇంకా అమలు చేయలేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మానుకోట జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. రాష్ట్ర మంత్రులకు హెలికాప్టర్లో తిరిగే ధ్యాసే తప్ప ప్రజా సంక్షేమంపై లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మానుకోట జిల్లాకు వచ్చిన ఆరుగురు మంత్రులు పెద్ద సభల్లో పాల్గొని, సన్మానాలు చేసుకొని తిరిగి వెళ్లిపోయారని, ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోలేదన్నారు.
పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో చేసిన అభివృద్ధి కనబడుతున్నదని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రజలను బురిడీ కొట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత రాష్ర్టాభివృద్ధిని మరచి ఢిల్లీకి మూటలు మోయడానికే పరిమితమయ్యాడని, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఎమర్జెన్సీని కాంగ్రెస్ తెచ్చిందని మండిపడ్డారు. ఆరుగురు మంత్రులు కాలయాపన చేస్తున్నారని, వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి చేయాలని కవిత డిమాండ్ చేశారు.
– మానుకోట మాజీ ఎంపీ కవిత