బచ్చన్నపేట, మే 27 : ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన మాజీ సర్పంచ్లను అరెస్టులు చేయడమేనా అని మాజీ సర్పంచ్ల ఫోరం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేశామని ప్రభుత్వం పేపర్ ప్రకటనకే తప్ప ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్కు వచ్చే సర్పంచులను ఎక్కడికి అక్కడ అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు.
అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచ్లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అరెస్ట్ అయినవారిలో వడ్డేపల్లి మల్లారెడ్డి, కోనేటి స్వామి, ముసిని సునీత రాజు గౌడ్, ఎండీ కలిలా బేగం ఆజాం, తాతిరెడ్డి భవాని శశిధర్ రెడ్డి, పర్వతం మధు ప్రసాద్ తదితరులున్నారు.