మహదేవపూర్, మే 15 : గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా పిలువబడే సరస్వతీ నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం 5.44 గంటలకు సరస్వతీ పుషరాలు వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతీ నదికి పుషరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం అయి న కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శా ఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యా యమూర్తి సూరపల్లి నంద, భూపాలపల్లి ఎమ్మెల్యే గం డ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడింగ్ కార్పొరేషన్ ఛైర్మ న్ ఐత ప్రకాశ్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి తొలి పూజలు చేసిన తర్వాత సరస్వతీ నది పుషర మహోత్సవ వేడుకలకు అంకురార్పణ చేశారు.
శ్రీగురుమదానంద సరస్వతి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి పుషర స్నానాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి, శ్రీ శుభానంద దేవి, సరస్వతీ మాత ఆలయాలను ప్రముఖు లు దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకా లు నిర్వహించారు. భక్తులు త్రివేణి సంగమం వద్ద సరస్వతీ మాతకు పూజలు చేసి పుణ్యస్నానాలా చరించారు. న దీ తీరం వద్ద పితృ తర్పణా లు, సంకల్ప పూజలు చేశారు.
సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలోని సరస్వతీ మాత విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి నదిలో పుణ్యస్నానం ఆచరించి గోదావరి హారతి తదితర పూజల్లో పాల్గొన్నారు.
రోజుకు రెండు లక్షల మంది భక్తులు పుషరాలకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేసినా మొదటిరోజు మందకొడిగా వచ్చారు. త్రివేణి సంగమం వద్ద భక్తులకు సరిపడా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. సరిపడా చలువ పందిళ్లు లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు ఎండకు విలవిలలాడారు. ఇంకా పది రకాల పనులు కొనసాగుతుండడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం వీఐపీ సేవలో తరించారు. భక్తులు మందకొడిగా రావడంతో వ్యాపారం జరగలేదని వ్యాపారులు నిరాశకు లోనయ్యారు. ఇదిలా ఉండగా పుషరాల్లో పూజలు నిర్వహించేందుకు ఆంధ్ర నుంచి సుమారు 600 మంది పూజారులు త్రివేణి సంగమానికి చేరుకున్నారు. ఇకడ పరిస్థితులు చూసి నివ్వెరపోయారు.
సరస్వతీ పుషర ఘాట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ నినాదాలు చేశారు. దళిత ఎంపీ అంటే అంత చిన్నచూపా అంటూ రాసిన ఫ్లకార్డులను పట్టుకొని ఆందోళన చేశారు. దీంతో అకడున్న పోలీసులు వారిని ఈడ్చుకుంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.