నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. పట్టణాలు, వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. సోమవారం భోగి పర్వదినాన్ని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు.
భోగి మంటలు వేసి పాటలు, కోలాటాలతో ఉత్సాహంగా గడిపారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మహిళలు, యువతులు ఉదయమే లేచి ఇళ్ల ముందు వివిధ రంగులతో పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపేలా ముత్యాల ముగ్గులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలు, నవ ధాన్యలతో అందంగా అలంకరించారు. ఘుమఘుమలాడే పలు రకాల పిండి వంటలను తయారుచేశారు.
గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇళ్లపైన, ఖాళీ ప్రదేశాలు, పంట పొలాల్లో పతంగులు ఎగురవేస్తూ సంబురంగా గడిపారు. వివిధ రంగులు, ఆకృతుల్లో గాలిపటాలు ఆకాశంలో హరివిల్లులా దర్శనమిచ్చాయి. కాగా, బుధవారం సంక్రాంతి, గురువారం కనుమ పండుగలు జరుపుకునేందుకు ప్రజలు సర్వం సిద్ధం చేసుకున్నారు.