ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఊరూరా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటిపై గొబ్బెమ్మలు పెట్టి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించారు. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. లోగిళ్లన్నీ సందడిగా మారాయి. చిన్నారులు గాల్లో పతంగులు ఎగురవేశారు. పిల్లా పెద్దా సంతోషంతో గడిపారు. కనుమ పండుగ రోజు రైతులు తమ పాడి గేదెలు, కాడెడ్లను ముస్తాబు చేశారు. పిండి వంటకాలను వాటికి తినిపించారు. తమ కుటుంబాలు పాడిపంటలు, పసిడి రాశులతో తులతూగాలని దేవుళ్లకు మొక్కుకున్నారు.