జయశంకర్ భూపాలపల్లి, జూన్ 15(నమస్తే తెలంగాణ) : అనుమతి పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని మానేరు సహా అనుమతి లేని వాగుల నుంచి దర్జాగా తోడేస్తున్నా అడిగేవారు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా జోరుగా దందా నడుస్తోంది. నిబంధనలకు పాతరేసి వాగులను లూటీ చేస్తున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఒక్క కేసూ నమోదు చేయకపోగా ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అవసరాల కోసమంటూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు జరుగకపోయినా పట్టపగలే వందల సంఖ్యలో ట్రాక్టర్లలో కమర్షియల్ నిర్మాణాలకు ఇసుక తరలిపోతున్నది. అయితే ట్రిప్పు లెక్కన రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ట్రాక్టర్ల యజమానులే బహిరంగంగా చెబుతుండడం దోపిడీ తీరుకు అద్దంపడుతుండగా, అధికారుల వైఖరితో సర్కారు ఆదాయానికి గండి పడుతోంది.
కమర్షియల్ అవసరాల కోసం ప్రభుత్వ క్వారీల నుంచి ఇసుక తీసుకోవాలనే నిబంధన ఇక్కడ బుట్ట దాఖలవుతోంది. కమర్షియల్ నిర్మాణాలకు సైతం మానేరు, కాల్వపల్లి క్వారీ ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ డంప్ చేసుకుని తరలిస్తున్నారు. ఇందుకోసం ఆయా అధికార యంత్రాంగానికి చేతులు తడుపాల్సి వస్తుందని తెలుపుతూ ఇసుక రవాణాదారులు చార్జీలు పెంచేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక ట్రిప్పుకు రూ.5వేలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదేమని అడిగితే ఇందులో నుంచి చాలామందికి ముట్టజెప్పాలంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
ఇసుక ముఖ్యంగా జిల్లాకేంద్రంలో జరుగుతున్న కమర్షియల్ నిర్మాణాలకే తరలిపోతోంది. గోదావరి ఇసుకను ఈ నిర్మాణాలకు వినియోగించుకోవాల్సి ఉండగా అంతే నాణ్యతతో ఉన్న మానేరు, కాల్వపల్లి వాగుల్లోని ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రతిరోజూ చిట్యాల మండలంలోని కాల్వపల్లి ఇసుక ట్రాక్టర్ల ద్వారా నాన్‌స్టాప్‌గా భూపాలపల్లికి రవాణా అవుతోంది. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ నిర్మాణాల పేరిట పట్టణంలోని పలు కాలనీలకు దర్జాగా రవాణా చేస్తున్నారు.
గతంలో అక్రమ రవాణా చేయాలంటే ట్రాక్టర్ యజమానులు భయపడేవారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అవసరాలకు అనుమతి ఇవ్వడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అలాగే అటవీ శాఖ పరిధిలోని దూదేకులపల్లి పెద్దవాగు, బొగ్గులవాగు, కాశీంపల్లి చెలిమెల వాగు, తీగలవాగు, మోరంచపల్లి వాగు, గద్దెకుంటవాగు, చిట్యాల మండలం కాల్వపల్లి వాగు నుంచి ప్రతిరోజు ట్రాక్టర్లలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.
ఒక్కో ట్రాక్టర్‌కు అటవీ శాఖ అధికారులు రూ.10వేలు నెలకు వసూలు చేస్తున్నట్లు ట్రాక్టర్ యజమానులే చెప్పుకోవడం గమనార్హం. భూపాలపల్లిలో మొత్తం 150 ట్రాక్టర్లు ఉండగా ప్రస్తుతం 50 ట్రాక్టర్లు మాత్రమే నడుస్తున్నాయి. టేకుమట్ల మండలం సమీప మానేరు వాగు నుంచి ఇసుక రాత్రివేళల్లో రవాణా అవుతోంది. ఈ క్రమంలో ఇసుక లారీలను, ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు లారీలకు బదులు ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జరుగకపోయినా రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నాయి.