ఏటూరునాగారం, ఏప్రిల్ 5 : అనుమతి లేకుండా ఇసుక కాంట్రాక్టర్ గోదావరిలో రోడ్డు వేసేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్న వైనం ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చెరుకూరుకు ఇసుక క్వారీ మంజూరవగా సద రు కాంట్రాక్టర్ నిబంధనలను తుంగలో తొక్కాడు. ముల్లకట్ట పంచాయితీ పరిధిలోని రాంపూర్ నుంచి చెరుకూరు గోదావరి ఒడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు శనివారం జేసీబీలు, డోజర్లతో పనులు చేపట్టాడు.
విషయం తెలుసుకున్న రాంపూర్ గ్రామస్తులు ఒడ్డును చెరిపేసి గోదావరిలోకి యంత్రాలను పంపించారు. ఇసుక క్వారీ మంజూరైన విషయం వారికి తెలియదు. ఈ క్రమం లో తమకు తెలియకుండా గోదావరిలో తవ్వకాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసి వాహనాలను ఒడ్డుకు చేర్చా రు. కాగా, సాయంత్రం మళ్లీ యంత్రాలను గోదావరిలోకి దింపి సుమారు కిలోమీటర్ మేర రోడ్డు కోసం తవ్వకాలు చేపట్టగా అడ్డుకొని పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించి ఇసుక క్వారీ అనుమతిపై ఆరా తీశారు.
అయితే ఇక్కడ ఇసుక క్వారీకి ఎలాంటి అనుమతి లేదని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందడంతో ఆర్ఐ గోదావరిలో రోడ్డుకోసం తవ్వకాలు చేపట్టిన ప్రదేశానికి వెళ్లి ఆరా తీశారు. ఏకో సెన్సెటివ్ జోన్ పేరుతో మండలంలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదనే విషయం తెలిసిందే. ప్రభుత్వ అనుమతులు లేకుండా రోడ్డు వేసేందుకు యత్నించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.