ములుగు, జనవరి25(నమస్తేతెలంగాణ) : మేడారం కల్తీమయంగా మారింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు నాసిరకం వస్తువులను అంటగడుతున్నారు. తినుబండారాల్లో నాణ్యత లోపిస్తున్నది. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయాలు చేపడుతున్నారు. ధరలు చుక్కలనంటుతున్నాయి. అదనంగా పదింతలు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారుల దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది.
మేడారం జాతరలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని కల్తీ లేని వ్యాపారం జరిగేలా చూడా ల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది తినే పదార్థాలలో పామాయిల్‌తో పాటు నాసిరకం సరుకులు, కుళ్లిపోయిన టమాటల నుంచి మాంసం వరకు విక్రయాలు చేస్తున్నారు. తక్కువ బరువు ఉన్న తూకం బాట్లతో దుకాణాలను కొనసాగిస్తున్నారు. శుచీశుభ్రత లేని, అపరిశుభ్రమైన ప్రాంతాల్లో మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆకాశాన్నంటుతున్న రేట్లతో పాటు కల్తీ వస్తువులు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు శాపంగా మారాయి.
తూనికలు, కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు జాతరలో సమర్థవంతమైన విధులు నిర్వర్తించి తనిఖీలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఆ శాఖ అధికారులెవరూ మేడారం జాతర పరిసరాల్లో కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. దీని వెనుక వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో మామూ ళ్లు వసూళ్లు చేసి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మేడారంలో కల్తీతో పాటు అధిక ధరలు, తూకంలో తేడాలను నియంత్రించాలని వారు కోరుతున్నారు.
మేడారం మహాజాతర ఇటు అధికారులకు, అటు కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు ఆదాయ వనరులా మారుతున్న ది. బయటి మార్కెట్లో ఉన్న ధరలకు అదనంగా పదింతలు పెంచి భక్తులకు నాసిరకం వస్తువులను విక్రయిస్తున్నా రు. బ్రాండెడ్ వస్తువులతో సమానంగా ప్యా కింగ్‌లు చేస్తూ నాణ్యత లేని వస్తువులు, కాలం చెల్లిన వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్‌లను అధిక ధరలకు విక్రయిస్తూ వ్యా పారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొబ్బరికాయల నుంచి మొదలు మేడా రం ప్రసాదంగా భావించే బెల్లాన్ని సైతం అడ్డగోలు ధరలకు అ మ్ముతున్నారు. తూకాల్లో కూడా తేడాలతో మోసం చేస్తున్నారు. తినుబండారాల్లోనూ నాణ్యత పాటించడం లేదు.
మార్కెట్లో రూ. 20కి దొరికే లీటర్ వాటర్ బాటిల్‌ను రూ.50గా ఫిక్స్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో పాటు రూ.20 ఉండే కూల్‌డ్రింక్‌ను సైతం రూ.50కి అంటగడుతున్నారు. కొబ్బరికాయను రూ.50 నుంచి రూ.60 వరకు, అదేవిధంగా రూపాయికి దొరికే పసుపు, కుంకుమ ప్యాకెట్లను సైతం రూ.10కి అమ్ముతున్నారు. వ్యాపారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా ఇష్టం ఉన్న రేట్లకు విక్రయిస్తున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. వ్యాపారులతో చేతులు కలిపారనేలా వ్యవహరిస్తున్నారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.