ఆరుగాలం కష్టించే రైతన్నకు కేసీఆర్ సర్కారు తెచ్చిన రైతుబీమా ఆపత్కాలంలో అండగా నిలుస్తోంది. గుంట భూమి ఉండి.. ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5లక్షలను అందిస్తూ భరోసానిస్తున్నది. అన్నదాతకు ఆసరా అయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇంతటి అద్భుతమైన పథకం ప్రారంభమై నేటికి ఐదేళ్లు అవుతున్నది. కేవలం వారం వ్యవధిలోనే నామినీ బ్యాంకు ఖాతాలో నగదు జమచేసి అవసరాలు తీర్చుతున్నది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,710 కుటుంబాలకు రూ.585.53 కోట్లు అందించి నేనున్నానని ధైర్యం చెప్పింది.
– వరంగల్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నడికూడ, ఆగస్టు 14: మాకు ఎకరం భూమి ఉన్నది. రెండేళ్ల కింద మా ఆయన సంజీవయ్య చనిపో యిండు. అంతకుముందే చెట్టంత కొడుకు కడుపు నొప్పితో పోయిండు. సీఎం కేసీఆర్ సారు నెల రోజుల్లోనే రూ. 5 లక్షలు మా బ్యాంకు ఖాతాల వేసిండు. ఆ యాల అవి లేకుంటే మేము అప్పుల పాలయ్యేటోళ్లం. పాత అప్పులు తీర్చిన. మిగిలిన పైసలు కూతురు పెండ్లికి దాచి, పోయిన యేడాది పెండ్లి చేసిన. రోజూ కూలీ పని చేసుకుంటు బతుకుతున్న. మమ్ముల్ని రైతు బీమా ఆదుకున్నది. సీఎం కేసీఆర్ సారు మేలు మరువలేం.
– బండ్ల స్వరూప, నడికూడ, హనుమకొండ జిల్లా
వరంగల్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నది. సాగులో అన్ని విధాలా సాయం అందిస్తున్నది. వ్యవసాయరంగం బలోపేతానికి ఉత్తమ విధానాలను అమలుచేస్తూనే రైతు కుటుంబాలకు భరోసా ఇస్తున్నది. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగించే అన్నదాతలకు ధీమా కల్పిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించి ఐదేండ్లు అవుతున్నది. ఈ పథకంతో రైతు కుటుంబాలకు అన్ని రకాలుగా భరోసా కలిగింది. రైతు బీమా పథకం కింద హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు 1887 కుటుంబాలకు రూ.94.35 కోట్లను అందించింది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,682 కుటుంబాలకు 84.1కోట్లు, ములుగు జిల్లాలో 1,094కుటుంబాలకు 54.70కోట్లు, జనగామ జిల్లాలో 2,071కుటుంబాలకు 103.55 కోట్లు, వరంగల్ జిల్లాలో 1,970 కుటుంబాలకు 98.5 కోట్లు అందించగా, అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 3,006 కుటుంబాలకు 150.33 కోట్ల నగదు అందించింది. పెద్ద దిక్కు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అవుతున్నది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అండగా నిలుస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీటి వనరులను మెరుగుపరిచింది. సాగుకు ఉచితంగా 24గంటలు కరెంటు ఇస్తున్నది. రైతుబంధుతో ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 1 లక్షా 36 వేల 325మంది రైతులకు రూ.1170 కోట్లను ఇచ్చింది. ఏ కారణం చేత అయినా రైతు చనిపోతే రైతుబీమా పథకంతో ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నది. రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు రైతుబీమా పథకాన్ని అమలుచేస్తున్నది. ఈ పథకం కింద రూ.5లక్షల బీమాను అందజేస్తున్నది. రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబీమా పథకం కింద ఏడాదిలో సగటున రూ.12 కోట్లను ప్రభుత్వం రైతు కుటుంబాలకు ఇస్తున్నది. వరి పంటలకు కనీస మద్దతు ధర కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 155 కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేస్తున్నది. వానాకాలం, యాసంగి కలిపి ఏటా రూ.300 కోట్లతో లక్షన్నర టన్నుల వడ్లను కొనుగోలు చేస్తున్నది. దీనితో సగటున 36వేల మంది రైతులకు మేలు జరుగుతున్నది. ప్రతి ఎకరా సాగుకు యోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నది. జిల్లాలోని దాదాపు 50వేల మోటార్లకు నిరంతరం ఉచిత కరెంటు అందిస్తున్నది. దీని కోసం ఏటా రూ.167 కోట్లను ప్రభుత్వం స బ్సిడీగా ఇస్తున్నది. వానాకాలంలో హనుమకొండ జి ల్లాలో 1,37,995 మంది రైతులకు రూ.132 కోట్లను, యాసంగిలో 1,35,859 మంది రైతులకు రూ.132 కోట్లను వారి బ్యాంకు అకౌంట్లలో జమచేసింది.
– అంకేశ్వరపు శ్రావణి, పులుకుర్తి, దామెర
దామెర, మే 24 : రైతు బీమా మా ఇంటికి పెద్ద దిక్కయ్యింది. మాది పేద కుటుంబం. నాకు ఇద్దరు కొడుకులు మణిదీప్, సిద్ధు. మాకు గ్రామ శివారులో కొద్దిగా ఎవుసం భూమి ఉంది. దాంతోనే మా కుటుంబం బతికేది. ఎవుసం, ఇంటి అవసరాల కోసం మా కుటుంబం అప్పుల పాలైంది. నా భర్త అంకేశ్వరపు శ్యాం(45) అప్పులు తీర్చలేక రెండేళ్ల క్రితం పురుగుల మందు తాగి చనిపోయిండు. ఆ తరువాత సీఎం కేసీఆర్ సార్ రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇచ్చిండు. వాటితో అప్పులు తీర్చిన. మిగిలిన డబ్బులతో నా కొడుకులను చదివిస్తాన. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ సార్. ఆయనకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంది.