హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 27 : ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు ఉదయం నుంచే నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యజామాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ ఆయా డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, కంట్రోలర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులకు రావాల్సిన రెండు వేతన సవరణలను అమలు చేస్తామని, యూనియన్ల కార్యకలాపాలను పునరుద్ధరిస్తామని, ఆర్టీసీని విస్తరిస్తామని తదితర హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ఒక హామీ కూడా నెరవేర్చలేదని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా కార్మికులతో 16 గంటలు పని చేయిస్తున్నదని, 2013 వేతన సవరణ బకాయిలు కేవలం డ్రైవర్లకు మాత్రమే చెల్లించి, ఆరు నెలలు గడిచినా మిగిలిన ఉద్యోగులకు వర్తింపజేయలేదని, పదేళ్ల నుంచి సుమారు 13 వేల మంది కార్మికులు వివిధ కారణాలతో వైదొలిగినా ఒకరిని కూడా కొత్తగా నియమించకపోవడంతో పనిభారం పెరిగిందన్నారు. దీంతో పాటు కార్మికులకు నెలకు ఒక సెలవు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై కార్మికులు తీవ్రంగా మండిపడ్డారు.