హనుమకొండ చౌరస్తా, మే 18 : సరస్వతీ అంత్య పుషరాలు ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు గోదావరి, ప్రాణహిత సరస్వతీ నదుల సంగమస్థలమైన పవిత్ర క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో హనుమకొండ-కాళేశ్వరంమార్గంలో భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, హనుమకొండ, వరంగల్-1, వరంగల్ -2 డిపోల ద్వారా మొత్తం 59 బస్సులు నడుస్తున్నాయని, పుషరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ భవానీప్రసాద్ తెలిపారు.
ఆదిలాబాద్, కరీంనగర్ రీజియన్లు కూడా వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,360 బస్సులను వినియోగించి 5,772 ప్రత్యేక ట్రిప్పులు నడిపేలా ప్రణాళిక రూపొందించామన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి, అదనంగా హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్ఎం తెలిపారు. కాళేశ్వరంలో 4.36 ఎకరాల విస్తీర్ణంలో తాతాలిక బస్‌స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ షెడ్లు, సిబ్బంది విశ్రాంతి గదులు, విద్యుత్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పర్యవేక్షణ కోసం 2 మొబైల్ టూ వీలర్ ప్యాట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.