భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 25: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నది. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి, మానసికంగా ఎదగడానికి, శారీరక దృఢంగా ఉండేందుకు, రక్త ప్రసణకు, మెదడు, గుండె చక్కగా పనిచేసేందుకు ఆటలు ఎంతోగానో ఉపయోగపడతాయని గుర్తించి సర్కారు పాఠశాలలకు క్రీడా పేర నిధులను విడుదల చేసింది. నేరుగా పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాలో జమవుతున్నాయి. ఈ నిధులతో క్రీడా పరికరాలు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున కేటాయించింది. ఈ నిధుల రాకతో పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొరత తీరనున్నది. రానున్న రోజుల్లో విద్యార్థులు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచనున్నారు.
రూ.26.80లక్షల నిధులు మంజూరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 417 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం రూ.26లక్షల 80వేల క్రీడా నిధులు మంజూరయ్యాయి. అందులోని 298 ప్రాథమిక పాఠశాలలకు రూ.14లక్షల 90వేలు, 44 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.4లక్షల 40వేలు, 75 ఉన్నత పాఠశాలలకు రూ.7లక్షల 50వేలు వచ్చాయి. మొత్తం నిధుల్లో ఎస్సీ కాంపోనెంట్ కింద రూ.6లక్షల 43వేల 200, ఎస్టీ కాంపోనెంట్ కింద రూ.3లక్షల 75వేల 200, జనరల్ కాంపోనెంట్ కింద రూ.16లక్షల 61వేల 600 గ్రాంట్లు ఉపయోగించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా క్రీడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సర్కారు పాఠశాలలకు నిధులను మంజూరు చేసి బడులకు చేయూతనందించింది.
కొనుగోలు చేసే
మంజూరైన నిధులతో వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్‌బాల్, క్రికెట్ బ్యాట్లు, బాస్కెట్ బాల్, షాట్ పుట్, జావెలిన్‌త్రో, రగ్బీ బ్యాగ్స్, స్కిప్సింగ్ రోప్స్, త్రోబాల్ వంటి తదితర సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. ప్రథమ చికిత్స కిట్లు, పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు సమకూరుస్తారు. వ్యాయామ ఉపాధ్యాయులు రోజూ విద్యార్థులకు అందజేసి ఆటలు ఆడిస్తూ వారి శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతారు.
క్రీడా సామగ్రి కొరత ఉండదు
క్రీడా నిధులు రావడంతో ప్రభు త్వ పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొర త ఇక ఉండదు. ప్రభుత్వ నిబంధ నల మేరకు క్రీడా సామగ్రిని కొను గోలు చేయిస్తాను. మంజూరైన నిధులు నేరుగా పాఠశాల యాజమాన్య ఖాతాలో జమయ్యాయి. ఆటలతో శారీరకంగా, మానసికంగా ఎదుగు తారు.
– ఎం.రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి