జనగామ రూరల్, డిసెంబర్ 29 : రైతుబంధు సాయం అన్నదాతలకు అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో అదునుకు పంట పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతో గ్రామాల్లో కర్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రెండో రోజు జిల్లాలోని 12 మండలాల్లో రెండు ఎకరాలున్న రైతులకు పెట్టుబడి నగదు అందింది. సుమారు 46 వేల మందికి రూ.15.56 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. యాసంగి సీజన్ వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అండంతో కర్షకులు సంబురపడుతున్నారు. యాసంగి సీజన్లో గతంలో కంటే సుమారు 600 మంది రైతులకు అదనంగా పెట్టుబడి సాయం అందిందని అధికారులు తెలిపారు. పంటల సాగుకు ఎంతో ఉప యోగపడుతాని తెలిపారు.
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటం..
జనగామ రూరల్ : అదనుకు పంట పెట్టబడి సాయం ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటం. వ్యవసాయాన్ని పండుగ చేసిండ్లు. యాసంగి సీజన్లో పొలం పనులకు రైతుబంధు డబ్బులు ఉపయోగపడుతయ్. చాలా సంతోషంగా ఉంది. నా పేరు మీద 3 గుంటల భూమి ఉంది. రూ.375 బ్యాంక్‌లో పడ్డాయని బ్యాంకు నుంచి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. సీఎం కేసీఆర్ కూడా మెసేజ్ పంపించారు. పెట్టుబడికి రంది లేదు. సార్‌ను ఎప్పటికీ మరువం.
– కొర్ర కమలమ్మ, మహిళా రైతు, కొర్రతండా
రైతుబంధు పైసల్ పడ్డయ్..
దేవరుప్పుల : నారు ఏతకు వస్తె చేబదలు డబ్బులు తెచ్చి 20 తారీఖు నాటు పెట్టిన. ఇవ్వాళ్ల డబ్బులు పడనేపడ్డయ్. మధ్యాహ్నం ఫోన్‌కు సీఎం కేసీఆర్ సార్ నుంచి మెసేజ్ వచ్చింది. బ్యాంకుల డబ్బులు పడ్డట్టు ఇంకో మెసేజ్ వచ్చింది. రేపు తీసి చేబదలు తీర్పుత. రైతుబంధు పైసలతోని మాకు చాలా సౌలత్ అయితుంది. అంతకు ముందు డబ్బులు ఎల్లక సావుకార్లపైన ఆధాపనడితె గోస పెట్టేది. నాకు ఎకరం భూమి ఉంది. ఏడాదిలో వచ్చే రూ.10 వేలు రెండు పంటలకు సరిపోతయ్. రెండు కార్లకు నీళ్లు పుష్కలం. 24 గంటల కరంటుతో పంటలకు రందిలేదు. -తీగల వెంకన్న, గొల్లపల్లి, దేవరుప్పుల మండలం