వరంగల్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో చెన్నారావుపేట పీఏసీఎస్ ఒకటి. గతంలో ఎంతో పారదర్శకతతో ఇతర పీఏసీఎస్‌లకు ఆదర్శంగా నిలిచిన ఈ సంఘానికి ప్రస్తుతం అక్రమాల తెగులు సోకింది. ఇటీవలికాలంగా ఈ పీఏసీఎస్‌పై అనేక ఆరోపణలొస్తున్నాయి. ప్రధానంగా పాలకవర్గంపై ప్రభు త్వ నిఘా విభాగాలకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పీఏసీఎస్ నుంచి చేపట్టిన గోదాముల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణ స్థానికంగా చర్చనీయాంశమైంది.
చెన్నారావుపేట పీఏసీఎస్ నర్సంపేట సమీపంలోని రాజపల్లె గ్రామం వద్ద 500 టన్నుల సామర్థ్యం గల గోదామును నిర్మించింది. కొద్ది నెలల క్రితం ప్రారంభమైన ఈ గోదాము నిర్మాణానికి రూ.56 లక్షలు వెచ్చించినట్లు పీఏసీఎస్ వెల్లడించింది. ఇతర పీఏసీఎస్‌లు ఇదే సామర్థ్యంతో కూడిన ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.35 లక్షలు రూ.35 లక్షలు వెచ్చిస్తే, చెన్నారావుపేట పీఏసీఎస్ రాజపల్లె వద్ద నిర్మించిన గోదాముకు రూ.56 లక్షలు వెచ్చించినట్లు ప్రకటించడంపై అదే మండలంలోని జల్లి గ్రామానికి చెందిన జక్క అశోక్ కొద్దిరోజుల క్రితం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. రాజపల్లె గోదాము నిర్మాణంలో సుమారు రూ.20 లక్షల దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నారు.
దీనికితోడు చెన్నారావుపేట పీఏసీఎస్ నెక్కొండ మండలం ముదిగొండ గ్రా మం వద్ద మరో గోదాము నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పీఏసీఎస్ నిధులతో అవసరమైన భూమిని కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కాకుండా మ రో స్థలంలో పీఏసీఎస్ గోదాము నిర్మాణం చేపట్టిందని, పనులు మొదలైన స్థలం ప్రభుత్వానికి చెందిన పోరంబోకుదని జక్క అశోక్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముదిగొండ వద్ద గోదాము నిర్మాణం కోసం చెన్నారావుపేట పీఏసీఎస్ నిధుల నుంచి కొద్దినెలల క్రితం రూ.10 లక్షలు విడుదల చేశారని, పనులు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయని అశోక్ తెలిపారు. నిర్మాణ పనులు ఆదిలోనే ఆగిపోయినా నిధులు విడుదల చేయడం దుర్వినియోగమేనని, ఇవి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
పీఏసీఎస్ నిధులతో కొనుగోలు చేసిన స్థలంలో కాకుండా పోరంబోకు స్థలంలో నిర్మాణం చేపట్టడాన్ని కూడా తప్పుపట్టారు. పోరంబోకు స్థలంలో గోదాము నిర్మించాలనుకుంటే అదే గ్రామం వద్ద భూమిని కొనుగోలు చేయడం నిధుల దుర్వినియోగమే అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పీఏసీఎస్ ఆధ్వర్యంలో వా నకాలం, యాసంగిలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలోని రైతులు అద్దె వాహనాల ద్వారా తమ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారని, ఇందుకో సం ప్రభుత్వం ఇచ్చిన ట్రాన్స్‌పోర్టు చార్జీలను కూడా పీఏసీఎస్ సదరు రైతులకు ఇవ్వలేదని అశోక్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
చెన్నారావుపేట పీఏసీఎస్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 9,744. వీరిలో 5,958 మంది గతంలో ఈ పీఏసీఎస్ ద్వారా రుణాలు పొందారు. మిగత 3,786 మంది సభ్యులు 2012-13 నుంచి 2024 మార్చి వరకు సభ్యత్వం పొందారని, ఈ కొత్త సభ్యుల్లో 379 మందికి పాలకవర్గం తీర్మానం మేరకు పాత సభ్యులతో కలిపి రుణాలను అందజేసినట్లు పీఏసీఎస్ ప్రకటించింది. ఈ పీఏసీఎస్‌లో నిధులున్నా 3,786 మంది కొత్త సభ్యుల్లో కేవలం 379 మందికి మాత్రమే రుణ పంపిణీ జరిగిందని, పీఏసీఎస్ రుణాలను అందజేయకపోవడం వల్ల కొత్త సభ్యుల్లో మిగతా 3వేల మందికిపైగా సభ్యులు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని జక్క అశోక్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. పీఏసీఎస్‌లో నిల్వ ఉన్న నిధుల నుంచి కొత్త సభ్యులందరికీ రుణాలు ఇస్తే గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పంట రుణాల మాఫీ వర్తించి సదరు 3 వేల మందికిపైగా రైతులు లబ్ధిపొందేవారని తెలిపారు.
కొత్త సభ్యుల్లో రుణాలు పొందిన వారు కూడా పాలకవర్గంలోని సభ్యుల అనుచరులేనని, విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ పీఏసీఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెట్రోల్‌బంకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపైనా అశోక్ ఆరోపణలు చేశారు. వివరణ కోరడానికి ఫోన్ ద్వారా ప్రయత్నించగా చెన్నారావుపేట పీఏసీఎస్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి స్పందించలేదు. ఈ పీఏసీఎస్ సీఈవో రవిని ఫోన్ ద్వారా వివరణ కోరగా గోదాముల నిర్మాణంలో అక్రమాలు, రుణాల అందజేతలో ఆరోపణలపై తానేమీ మాట్లాడలేనని దాటవేశారు. చైర్మన్‌తో మాట్లాడండి అంటూ సమాధానం ఇచ్చారు.