సుబేదారి, జూలై 21 : వరంగల్ నగరంలోని కరడుగట్టిన కిరాత హంతకులు రాజకీయ ముసుగులో పెట్రేగిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండతో తమ పాత నేరప్రవృత్తితో సుపారీ తీసుకొని కిడ్నాప్‌లు, హత్యలు, హత్యా యత్నాలు, దాడులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు తమ చేతికి మట్టి అంటకుండా రౌడీషీటర్లును చేరదీసి వారిని దందాలు, సెటిల్మెంట్లకు వాడుకుంటున్నారు.
నగరంలో ఒకప్పుడు పోలీసు రికార్డుల్లో నేరస్తులుగా ముద్రపడిన వారు, ఇప్పుడు రాజకీయ ముసుగు వేసుకొని నేతల సపో ర్ట్తో ల్యాండ్, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ పంచాయితీల్లో జోక్యం చేసుకొంటున్నారు. వీరికి అధికార పార్టీ నాయకులు రక్షణ కవచంగా ఉండడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పైరవీలతో పోస్టింగ్‌లు పొందిన పోలీసు అధికారులు, ముఖ్యంగా స్థానిక ఇన్స్పెక్టర్లు వీరికి వంత పాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ట్రైసిటీలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని జనం వణికిపోతున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 700 మందికిపైగా రౌడీషీటర్లు ఉండగా, ఇందులో నగరంలోనే ఎక్కువ మంది ఉన్నారు. సుమారుగా 15మందికిపైగా మళ్లీ పాత నేర ప్రవృత్తిలో యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి స్థానిక అధికార పార్టీ నేతల సపోర్డ్ ఉండడంతో రెచ్చిపోతున్నారు. మిల్స్‌కాలనీలో ఐదుగురు, ఇంతేజార్‌గంజ్‌లో నలుగురు, మట్టెవాడలో ముగ్గురు, హనుమకొండలో ఆరుగురు, సుబేదారిలో నలుగురు, కాజీపేట, మడికొండ, కేయూసీ పరిధిలో ఒక్కొక్కరు భూ కబ్జాలు, ఆర్థిక లావీదేవీలు, కుటుంబ పంచాయితీల్లో తలదూరుస్తున్నారు.
వీరిలో 15మందికి పైగా ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరుల సపోర్ట్ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఏకంగా ఖద్దరు చొక్కాలతో అధికార పార్టీ రౌడీ లీడర్లుగా చెలామణి అవుతున్నారు. రికార్డులో రౌడీషీటర్లుగా ముద్రపడి, ఏదో పనిచేసుకుంటున్న వారిని లోకల్ పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాజకీయ నేతల అండతో నేరాలకు పాల్పడుతున్న వారిని మాత్రం టచ్ చేయడం లేదు. దీనికి వెనుకాల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్ననేది స్పష్టమవుతున్నది.
గతంలో టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. ఏ చిన్న నేరం జరిగినా కౌన్సిలింగ్ పేరుతో తమదైన ైస్టెల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇక్కడ పనిచేసి బదిలీ అయిన ఐపీఎస్ అధికారి వైభవ్ సినిమా ైస్టెల్లో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపడంతో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ ఏడాదిన్నర కాలం నుంచి హంతక రౌడీషీటర్లు అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్నారు.
ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో కరుడు కట్టిన నేరస్తుడు పత్తి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఎర్రగట్టుగుట్ట వద్ద కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని రౌడీషీటర్ సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేసిన ఘటన వెలు గులోకి వచ్చింది.
అలాగే హనుమకొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ డాక్టర్‌ను డబ్బులివ్వకుంటే చంపేస్తామని బెదిరించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరుడుకట్టిన రౌడీషీటర్ నాలుగు నెలల క్రితం నయీంనగర్‌లో అద్దె తీసుకున్న షట్టర్ ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. వరంగల్ సబ్ డివిజన్‌కు ఐపీఎస్ అధికారి పనిచేసినంత కాలం సెటిల్మెంట్లకు దూరంగా ఉన్న అధికార పార్టీకి చెందిన నేత ప్రధాన అనుచరుడు, ఆ అధికారి బదిలీతో మళ్లీ దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఇన్స్పెక్టర్లు రౌడీషీటర్లతో సంబంధాలు పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు. పోలీసుల అండతో కొందరు భయం లేకుండా నేరాలకు పాల్పడుతుండడంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.