Hanmakonda | ఐనవోలు, ఆగస్టు 01 : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేల్ నుంచి వయా వడ్డరగూడెం పెరుమాండ్లగూడెం వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై ప్రతిరోజూ రైతులు, వాహనదారులు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. నూతన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా పున్నేల్ పెరుమాండ్లగూడెం గ్రామాల మధ్య సుమారుగా మూడు కిలోమీటర్ల వరకు రెండు సంవ్సతరాల క్రితం కంకర వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ విభాగములో సీఆర్ఆర్ 2021-22 సంవత్సరంలో, అంచనా విలువ రూ.2 కోట్ల 10 లక్షలలతో రోడ్డు నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ 21 సెప్టెంబర్ 2022 శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి సుమారుగా 34 నెలల కాల వ్యవధిలో ముందు సాగని రోడ్డు నిర్మాణ పనులు. కంకర వేసి దానిపై తారు వేయకపోవడంతో వాహనదారులకు, రైతులకు తిప్పలు తప్పడం లేదు. కంకర ఉండడంతో బావుల దగ్గరికి వెళ్లె రైతులు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పడిపోయి ప్రమాదాలు కూడ జరిగాయి. ఈ మధ్య కాలంలో ఇద్దరి ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి కూడా గురైయ్యారు. వర్షాకాలం కనుక ఈ రోడ్డు పైన ప్రయాణం చేయాలంటేనే రైతులు, ప్రమాణికులు భయం, భయంగా ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని రైతులు, ప్రమాణికులు కోరుతున్నారు.