జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించగా ప్రభుత్వం మారగానే అవి ఆగిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కాంట్రాక్టర్లను సైతం మార్చినా పది నెలలుగా పనులకు అతీగతీ లేదు. అలాగే పట్టణంలో మూడు జంక్షన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు ఇచ్చినా పనులు ప్రారంభం కాలేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి జనం సతమతమవుతున్నా అధికారుల్లో చలనం లేదు. వెంటనే పనులు పూర్తి చేసి తమ ఇబ్బందులు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఓపెన్‌కాస్టు జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్ర త్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయించారు. అప్పటికే జంగేడు మీదు గా సెగ్గంపల్లి, కాశీంపల్లి వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పూర్తి చేశారు. అనంతరం చేపట్టిన అంబేద్కర్ సెంటర్ నుంచి రామాలయం మీదుగా ఓసీ జంక్ష న్ వరకు పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం మారడంతో నిలిచిపోయాయి. సుమారు 1700 మీటర్ల పొడవుతో రూ.10 కోట్ల తో చేపట్టిన పనులకు అధికారులు బ్రేక్ వేశారు. పాత కాంట్రాక్టర్లను తప్పించి కొత్తవారికి అప్పగించారు. అయినా పది నెలలుగా మోక్షం లభించలేదు. అయితే జనం నుంచి వస్తున్న ఒత్తి డి మేరకు అధికారులు ఇప్పుడిప్పుడే డ్రై నేజీ పనుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న సెంటర్లను గుర్తించిన గత ప్రభుత్వం అంబేద్కర్, జయశంకర్, గణేశ్ సెంటర్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఒక్కో సెంటర్‌కు మొదటి విడతగా రూ. 10 లక్షల చొప్పున కేటాయించింది. ఈక్రమంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఓసీ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అనంతరం సెంట్రల్ లైటింగ్‌తో పాటు జంక్షన్ అభివృద్ధి చేపట్టాలని ప్లాన్ చేశారు. అయితే రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ పడడంతో జంక్షన్ల అభివృద్ధి ఆగింది. పది నెలలుగా పనులు పెండింగ్‌లో ఉండడంతో జంక్షన్ల అభివృద్ధి అటకెక్కింది. దీంతో ముఖ్యం గా అంబేద్కర్ సెంటర్లో ట్రాఫిక్ సమ స్య తీవ్రతరమవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
అనివార్య కారణాల వల్ల రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించగా ప్రస్తుతం డ్రైనేజీ పనులు ప్రారంభించాం. అనంతరం రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగిస్తాం. పనుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు పనులు స్పీడప్ చేస్తాం.