రుణమాఫీ పూర్తయ్యిందన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల లోపు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని నమ్మించి.. చివరికి నట్టేట ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా వర్తింపజేస్తామని చెప్పి.. లేని పోని కొర్రీలు పెట్టి సగం మందిని మాఫీకి దూరం చేశాడని ఆవేదన చెందుతున్నారు. మొదటి విడత జాబితా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నా.. ముఖ్యమంత్రికి కనికరం లేకుండా పోయిందంటు న్నారు. అన్ని అర్హతలుండీ మాఫీ కాలేదని ఆందోళనలు చేస్తే.. సెల్ఫీలు, గుర్తింపు ధ్రువపత్రాలు తీసుకొని వంచించాడని ఫైర్ అవుతున్నారు. రూ. 2 లక్షలకు పైనున్న డబ్బులు చెల్లిస్తే మాఫీ అవుతుందన్న బూటకపు మాటలకు ఆశపడి అధిక మిత్తికి అప్పులు తెచ్చి బ్యాంకుల చెల్లించి గోసపడుతున్నామని చెపుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
మహదేవపూర్ : నాకు మహదేవపూర్ శివారులో 5 ఎకరాల భూమి ఉంది. నేను స్థానిక పీఏసీఎస్ నుంచి రూ. 2.50 లక్షల పంట రుణం తీసుకున్న. ప్రభుత్వం ప్రకటించినట్లుగా నాకు రూ. 2 లక్షల వరకు మాఫీ అవుతుందని అనుకున్న. లిస్ట్‌లో నా పేరు రాకపోవడంతో బ్యాంక్ అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నరు. వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. గత కేసీఆర్ సర్కారులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, కొర్రీలు లేకుండా రుణమాఫీ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మమ్ముల్ని ముప్పు తిప్పలు పెడుతాంది. చాలా మందికి మాఫీ కాక బ్యాంక్‌లు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నరు. ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరి రుణాలు మాఫీ చేయాలి.
– అడప లక్ష్మీ నారాయణ, రైతు, మహదేవపూర్
రాయపర్తి : ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తమంటే రైతులంతా సంబురపడి అధికారం అప్పజెప్పిండ్లు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రోజుకో మాట, పూటకో ముచ్చట చెప్పుకుంట కాలం గడుపుతాండు. నాకు రాయపర్తిలోని ఎస్బీఐలో రూ.1,20,250, నా భార్య రమనీతకు వర్ధన్నపేట డీసీసీబీలో రూ. 80,613 అప్పు ఉంది. ఇద్దరికి కలిపి రూ. 2,00, 863 ఉండటంతో మాఫీ కాలేదని అప్పుడు ఆఫీసర్లు చెప్పిండ్రు. మా కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఎందుకైనా మంచిదని రూ. 10 వేలు క్రాప్ అకౌంట్ల కట్టి మూడు నెలలు దాటినా మాఫీ లేదు.. మన్నూ లేదు.. ఏం లాభం లేదు.
– కే సాంబరాజు, యువ రైతు, రాయపర్తి
నర్సింహులపేట : నేను బ్యాంకులో రూ. 2.70 లక్షల లోను తీసుకున్న. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులు పై డబ్బులు బ్యాంకులో కడితే వెంటనే రుణమాఫీ చేస్తామంటే ఆగస్టు నెలలో రూ. 3 మిత్తికి అప్పు తీసుకొచ్చి రూ.70 వేలు కట్టిన. అయినా నాకు రుణమాఫీ కాలేదు. ఇది ఏంది సారు అని ఏవోను అడిగితే మాకేం తెల్వదు, ప్రభుత్వం నుంచి లిస్టు వస్తనే తెలుస్తదని చెబుతున్నడు. అసలు మాకు రుణమాఫీ అయితదా? కాదా? జర చెప్పండి.
– గుగులోత్ నెహ్రూ, రైతు, పత్నితండా, నర్సింహులపేట
ఆత్మకూరు: రుణమాఫీ లిస్టులో నా పేరు లేదు. గతంలో చాలా సార్లు వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి అధికారులను అడిగితే ప్రాసెసింగ్‌లో ఉందన్నరు. ఇంకో విడుతలో రుణమాఫీ అవుతుందని చెప్పిండ్రు. కెనరా బ్యాంక్‌లో రూ. 2 లక్షల లోన్ తీసుకున్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ కట్టిన. బ్యాంకోళ్ల వద్దకు వెళ్లి అడిగితే లిస్టు రాలేదంటున్నరు. అధికారులు పొంతన లేకుండా సమాధానం చెబుతున్నరు. ప్రభుత్వం రుణమాఫీ అయిందని ప్రకటనలు చేస్తున్నది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
– రంపీసా మనోహర్, రైతు, తిరుమలగిరి, ఆత్మకూరు
హసన్‌పర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే నమ్మినం. కానీ నట్టేట ముంచింది. బ్యాంక్, వ్యవసాయ అధికారులకు అన్ని పత్రాలు ఇచ్చినం. రేపుమాపు అని తిప్పుతున్నరు. రుణమాఫీ చేసినమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్తాండు కాని బ్యాంక్‌లో అడిగితే వాళ్లు కాలేదంటున్నరు. ఎవల్ని నమ్మాలో తెల్తలేదు. అడ్తిదారు వద్ద అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినం. ఈ సర్కారు మాటలల్లనే కాని చేతలల్ల లేదు.
– బొజ్జ అశోక్, రైతు, జయగిరి, హసన్‌పర్తి
నడికూడ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేశానని చెప్తున్నది కానీ అందరికీ కాలేదు. నేను రూ. 1,50,000 పంట రుణం తీసుకోగా అసలు వడ్డీ కలిపి రూ. 1,71,000 అయినయ్. రుణమాఫీ కాకపోగా అదనంగా రూ. లక్ష బ్యాం కోళ్లు కట్టించుకున్నరు. ఇకనైనా ప్రభుత్వం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలి.
– చందా కుమారస్వామి, రైతు, వరికోల్