హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 11 : 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ తర్వాత హాయిగా రెస్ట్ తీసుకుందామనుకున్న వారి జీవితాల్లో కటిక చీకట్లు అలుముకున్నాయి. రిటైర్మెంట్ తీసుకొని 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నారు. అసలు వస్తాయో.. రావోనని కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. చివరికి చేసేదేమీక వృద్ధాప్యంలో రోడ్డెక్కి ఉద్యమం చేసేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ సర్కారుపై తాడోపేడో తేల్చుకునేందుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కమిటీ ఏర్పాటు చేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు వెయిమంది వరకు రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా.., అందులో సుమారు 500 మంది వరకు టీచర్లే ఉన్నారు. వీరందరూ బెనిఫిట్స్ అందక నలిగిపోతున్నారు. రిటైరయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకొని పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకు ఈఎంఐలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సొమ్ము చేతికి అందుతుందనే భరోసాతో అప్పులు చేసి కార్యాలను గట్టెకించుకున్నవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నెలలు దొర్లిపోతున్నా ఇంకా ఆ సొమ్ము చేతికందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్ల క్రితం 58 నుంచి 61కి పెంచింది. ఆ గడువు మార్చితో ముగిసింది. అప్పటి నుంచి ప్రతినెలా సుమారు 200కిపైగానే ఉద్యోగులు విరమణ పొందుతున్నారు.
వారిలో సగటున 100 మంది వరకు ఉపాధ్యాయులే ఉన్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉద్యోగ విరమణకు నాలుగు నెలలు ముందే అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి తాము రిటైర్ అవుతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు. అయినా, 18 నెలలైనా బెనిఫిట్స్ రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి అన్నీ చెల్లించాలంటే సుమారు వెయ్యి కోట్ల వరకు అవసరమని అంచనా. హనుమకొండ జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక విరమణ పొందడానికి సిద్ధంగా ఉన్నవారిలోనూ ఒకింత ఆందోళన మొదలైంది.
ఉద్యోగ విరమణ పొందిన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలు గ్రాట్యుటీ, వేతనం నుంచి నెలనెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), గ్రూప్ ఇన్సూరెన్స్(జీఎల్ఐ), కమ్యుటేషన్, సరెండర్ లీవులు, పీఆర్సీ 2020 ఏరియర్స్, తదితరాల రూపేణా ఇవ్వాల్సినవి ఏకమొత్తంలో చెల్లించాలి. ఆ ప్రకారం ఉద్యోగులస్థాయిని బట్టి సగటున రూ.50 లక్షల వరకు చెల్లించాలి. ప్రభుత్వ తీరుచూస్తుంటే ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి పరిస్థితి కొనసాగితే వృద్ధాప్యంలో ఎలా బతకాలి అంటూ రిటైర్డ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా విరమ ణ పొంది ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పెండింగ్ బకాయిలు ఇవ్వడంలేదు. ఓపిక నశించింది. ఉద్య మం చేసేందుకు సిద్ధమయ్యాం. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వారిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ కూడా ఏర్పాటు చేశాం. డబ్బు లు చెల్లించకుండా పెన్షనర్లను మానసికంగా వేధిస్తున్నారు. ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన వారిలో 26 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 13 వేల మంది రిటైర్ అయ్యారు. వృద్ధాప్యంలో బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నాం.
– శ్రీధర్ల ధర్మేంద్ర, రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు