ఒకప్పుడు నగర ప్రజలు సేద తీరాలంటే ఏ పార్కుకో, సినిమాకో వెళ్లేవారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్నది. దీనికి తోడు డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజలు ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ఎప్పుడో సేద తీరాలనుకుంటే సరైన ప్రదేశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో ఖాళీ ప్రదేశాలు మాయమై కమర్షియల్ కాంప్లెక్స్‌లు వెలుస్తున్నాయి. పోనీ ఎక్కడికైనా టూర్ వెళ్దామంటే సెలవు దొరకక, సమయం సరిపోక ఆ ఆలోచనను విరమించుకుంటున్నారు.
కనీసం వీకెండ్లోనైనా దగ్గరలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు రిసార్ట్ కల్చర్‌ను పరిచయం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాతి నగరంగా.. విద్యా కేంద్రాలకు నెలవుగా ప్రసిద్ధి చెందిన వరంగల్ చుట్టూ అందమైన అలంకరణలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరం వెలుపల వెలసిన 20 వరకు రిసార్ట్‌ల్లో సేద తీరేందుకు నగర ప్రజలు క్యూ కడుతున్నారు. పార్టీలు, శుభకార్యాలు జరుపుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– హనుమకొండ సబర్బన్, అక్టోబర్ 5
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా పేరున్న వరంగల్ మరింత విస్తరిస్తున్నది. పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఏర్పాటవుతుండడంతో వీటిల్లో చదువుకునేందుకు దేశ, విదేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఇవి కాకుండా ఐటీ పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపార, వాణిస్య సంస్థలు తమ బ్రాంచ్‌లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఇక్కడి వారితో పాటు వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలు నగరంలో నివాసముంటున్నారు. వీరంతా కుటుంబాలతో సేద తీరేందుకు సెలవు దినాల్లో హైదరాబాద్‌కు పయనమవుతున్నారు. వీరి అవసరాలను పసిగట్టిన మామిడి తోటల యజమానులు రిసార్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
వరంగల్ నగరానికి 20 కిలోమీటర్ల పరిధిలో సుమారు 600 ఎకరాల్లో పలువురు రైతులు, వ్యాపారులు, అధికారులకు సంబంధించిన మామిడి తోటలున్నాయి. వీటి ద్వారా ఏటా పంట మాత్రమే తీసుకునే వారు. ఆ తోటల్లోనే మరింత ఆదా యం కోసం మామిడి చెట్లను తొలగించకుండానే రిసార్టులను తీర్చిదిద్దుతున్నారు. స్విమ్మింగ్ పూల్స్, అందమైన గదులు, గ్రామీణ సంస్కృతి ఉట్టి పడే వాతావరణంతో ఆకట్టునేలా ఏర్పా ట్లు చేస్తున్నారు. వ్యవసాయ పనిముట్లు, చిన్నారుల ఆట వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. అందమైన పలు విగ్రహాలు, సువాసన వెదజల్లే పూల చెట్లు పెంచుతున్నారు. చిన్నచిన్న పార్టీలు, శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా హాళ్లను సైతం నిర్మిస్తున్నారు.
నగరం చుట్టూ నిర్మించిన పలు రిసార్టుల వివరాలను సోషల్ మీడియా వేదికగా యాజమానులు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో సెలవులు, వీకెండ్‌ను ఎంజాయ్ చేసేందుకు నగర వాసులు అక్కడికి వెళ్తున్నారు. కొందరు కుటుంబాలతో జాలీగా గడిపి వస్తుండగా మరికొందరు స్నేహితులతో వెళ్లి వస్తున్నారు. ఇంకొందరు చిన్న చిన్న పార్టీలు చేసుకుంటుండగా, కొందరు బర్త్‌డేలు, ఎంగేజ్మెంట్లు తదితర శుభకార్యాలను ఇక్కడే ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ కంపనీలు తమ వ్యాపార సమావేశాలను కూడా రిసార్టుల్లోనే నిర్వహిస్తున్నాయి. ప్రశాంతంగా, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉండే ఈ రిసార్ట్‌లకు ప్రాధాన్యత పెరుగుతున్నది. కొన్ని రిసార్టుల్లో రుచికరమైన ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఇవి ప్రారంభ దశలోనే ఉండడంతో చార్జీలు కూడా తక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు.
గతంలో వారాంతపు సెలవులను ఎంజాయ్ చేసేందుకు వందలాది మంది హైద రాబాద్‌కు వెళ్లేవారు. ప్రస్తుతం మన దగ్గర కూడా రిసార్టులు ఏర్పాటు కావడంతో ఇప్పుడిప్పుడే వచ్చేందుకు అలవాటు పడుతున్నారు. ప్రకృతిలో సేద తీరాలనుకునే వాళ్లు రిసార్టులను ఎంచుకుంటున్నారు. ఫంక్షన్ హాళ్లలో చేసుకునే శుభకార్యాలకు ఇలా వచ్చి అలా వెళ్తారు. ఇక్కడ మాత్రం బంధువులందరితో కలిసి రెండు, మూడు రోజులుండి వెళ్తున్నారు.
– పోలేపల్లి రాజిరెడ్డి, రిసార్ట్ యజమాని