ఏటూరునాగారం, ఫిబ్రవరి 3: ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులోని కొండలు, గుట్టలపై నుంచి నిత్యం వస్తున్న జలధార ఎంతో స్వచ్ఛమైనదని తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. చింతామణి పేరుతో మల్లూరులోని శ్రీలక్ష్మీ నర్సింహస్వామి గుట్టపై నుంచి ఏడాది పొడవునా వచ్చే నీరు తాగేందుకు ఎంతో శ్రేష్టమైనదిగా తేటతెల్లమైంది. ఎలాంటి రసాయనాల మిళితం కాకుండా గుట్టలపై నుంచి వస్తున్నట్లు తేలింది. వాటర్ ల్యాబొరేటరీ చీఫ్ కెమిస్ట్రీ కృష్ణమూర్తి సమక్షంలో మూడు రోజుల పాటు ఈ నీటిపై 32 రకాల పరీక్షలు చేపట్టారు.
నీటిలో ఫ్లోరైడ్, క్లోరైడ్ లేనట్లుగా ధ్రువీకరించారు. ఈ గుట్టపై అనేక రకాల వన మూలికల వృక్షాలు ఉండడంతో వీటి వేర్లను తాకుతూ వచ్చే నీరు ఎంతో శుద్ధిగా ఉన్నట్లు తేలింది. ఫిల్టర్లు, ఆర్వో ప్లాంట్ల నుంచి శుద్ధిచేసి వచ్చే నీటి కంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి నీటిని ఎక్కడ చూడనట్లుగా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై రిటైర్డ్ న్యూరో వైద్యులు రాజారెడ్డి మాట్లాడుతూ ఎంతో స్వచ్ఛంగా వచ్చే నీటిని తాగడానికి, వంటలు చేసుకోడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఇటీవల మల్లూరు వచ్చినపుడు నీటిని సేకరించి పరీక్షలకు పంపించినట్లు చెప్పారు.
పరీక్షలో నమ్మలేని నిజాలు గుర్తించామన్నారు. ఇలాంటి స్వచ్ఛమైన నీరు ఎక్కడ లేదన్నారు. నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలని సూచించారు. అనవసరంగా పంట పొలాలకు వాడడం కంటే ఈ నీటిని నిల్వచేసి గ్రామాలకు సరఫరా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. భూగర్భం నుంచి కాకుండా ప్రకృతి నుంచి వచ్చే నీరుగా ఆయన అభివర్ణించారు. మానవుడికి హాని కలిగించే రసాయనాలు, వ్యాధికారకాలు ఈ నీటిలో లేవని పరిశోధనలో వెల్లడైనట్లు స్పష్టం చేశారు.