బచ్చన్నపేట: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను ( Belt Shops ) వెంటనే మూసివేసి, కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి ( Satish Reddy ) డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెం డెంట్ ( Excise Superintendent ) అంజిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తుండటంతో కల్తీ మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోందన్నారు. నాణ్యత లేని మద్యం సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించడంతో పాటు అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మద్యం వ్యసనం కారణంగా కుటుంబాల్లో కలహాలు పెరగడం, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కోవడం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం జరుగుతోందన్నారు.
రోజువారీ కూలీలు, పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని మద్యం కోసం ఖర్చు చేస్తుండటంతో కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
అక్రమ బెల్ట్ షాపులను గుర్తించి వెంటనే మూసివేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దూడల కనకయ్య, ముసిని రాజు గౌడ్, మహమ్మద్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.