కాంగ్రెస్‌లో ‘ఇందిరమ్మ కమిటీ’లు పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే రేవంత్ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు కొద్దిరోజులుగా భగ్గుమంటోంది. దీనికి తోడు ఇటీవల సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న ‘ఇందిరమ్మ కమిటీ’లతో మరింత ముదిరి కుమ్ములాటలకు దారితీసింది. ముఖ్యంగా స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్‌లో పరిస్థితి తారస్థాయికి చేరింది. కమిటీలో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తున్నారంటూ పార్టీనే నమ్ముకొని ఉన్న సీనియర్లు, ఎమ్మెల్యే వర్గంపై ఆగ్రహంతో ఉండగా రోజుకో చోట రాస్తారోకోలు, నిరసనలతో పాటు దిష్టిబొమ్మల దహనాల దాకా వెళ్లింది. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే లకు వార్నింగ్‌లు, పరస్పరం విమర్శల నడుమ కొందరు గాంధీభవన్ మెట్లెక్కగా, ఇంకొందరు అవసరమైతే ఢిల్లీకైనా వెళ్తామనడం అంతటా చర్చనీయాంశమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏర్పాటు చేస్తున్న ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే సభ్యులుగా ఉంటున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారి చైర్మన్‌గా, కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్‌గా వార్డు/డివిజన్ అధికారి కన్వీనర్‌గా ఉంటారు. గ్రామ, పట్టణ ఇందిరమ్మ కమిటీలో స్వయం సహాయ సంఘాల్లోని ఇద్దరు మహిళలు.. మరో ముగ్గురు సాధారణ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. వీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉండాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. కమిటీలో నియమించే స్వయం సహాయక సంఘాల మహిళలు, మరో ముగ్గురు సభ్యుల పేర్లను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనరు కలెక్టరుకు ప్రతిపాదించాల్సి ఉంటుంది. అనంతరం ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి ఆమోదం తర్వాత నియమాకం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులనే ఈ కమిటీల్లో సభ్యులుగా పెడుతున్నారు. దీంతో ఆ పార్టీలోని వారి మధ్య వర్గపోరు తీవ్రమవుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఇందిరమ్మ కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ వారిని ఈ కమిటీల్లో నియమించడవం వల్ల ఇండ్ల కేటాయింపులో అర్హులకు న్యాయం జరగదనే విమర్శలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ వారికి మేలు చేసేందుకే ఇందిరమ్మ కమిటీలు పని చేస్తాయని అభిప్రాయం ఉన్నది.
మహబూబాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటులో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండల స్థాయి కాం గ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. పార్టీ శ్రేణుల మనోభావాలను పట్టించుకోకుంటే పొలిమేర వరకు తరిమికొడతామని వార్నింగ్ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వర్గపోరు నడుస్తున్నది.
సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఘర్షణలకు కారణమవుతున్నది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కమిటీలు కాంగ్రెస్‌లో వర్గపోరును పెంచుతున్నది. గ్రామాల్లోని కాంగ్రెస్ వర్గపోరు అక్కడక్కడా ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఇచ్చేదాకా వెళ్తున్నది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈ కమిటీల గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. శ్రీహరి వర్గం గ్రామాల్లో పెత్తనం చేస్తుండడంపై మొదటినుంచి కాంగ్రెస్‌లో ఉన్న వారు తీవ్ర అసంతృప్తితో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేసే వరకు వెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండల స్థాయిలోని నేతలంతా కడియం వర్గంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కాంగ్రెస్‌లో మొదటి నుంచి తమకు ఇందిరమ్మ కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పరకాల నియోజకవర్గంలోనూ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో కాంగ్రెస్ గ్రూపు పోరు నివురుగప్పిన నిప్పులా ఉన్నది. మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కొత్త గొడవలను సృష్టిస్తున్నది. జనగామ, ఇల్లెందు నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ ప్రక్రియ వేగవంతమైతే అన్ని చోట్ల కాంగ్రెస్‌లోని వర్గాలు బహిరంగంగా పోటీ పడే పరిస్థితి కనిపిస్తున్నది.
వేలేరు, అక్టోబర్ 18: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరిపై వేలేరు మండల పాత కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను విస్మరించి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీల ఎంపికలో వారికే అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. పూటకో పార్టీ మారే నాయకులకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలో నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఎమ్మె ల్యే తన వైఖరి మార్చుకోకపోతే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.