హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 11: భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సమ్మిళిత వృద్ధి ద్వారానే సాధ్యమని సౌత్ ఆఫ్రీకా డర్బస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. హనుమ కొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవీందర్ రేనా మాట్లాడుతూ వికసిత భారత్ సాధనకు యువశక్తి, నారీశక్తి, రైతుశక్తి మొదలైన నాలుగు అంశాలు అత్యంత కీలకమని, అభివృద్ధికి వెలుపల ఉన్న అన్ని వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చే విధంగా అభివృద్ధి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ బి.సురేష్లాల్ మాట్లాడుతూ ఇప్పటివరకు దేశం అనుసరించిన అభివృద్ధి నమూనాల వలన భారత ఆర్థిక వ్యవస్థ స్తబ్దత నుంచి శక్తివంతమైన స్థితికి రూపాంతరం చెందిందని, 2047 వరకు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగడానికి మానవవనరుల అభివృద్ధితో పాటు గ్రామీణ వ్యవస్థాపన సౌకర్యాల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ గాలి రాజారెడ్డి, అర్ధశాస్త్ర విభాగాధిపతి ఎం.రవీందర్, ఏ.వెంకటరమణ, ఎం.వెంకన్న, పి.మాలతీలత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.