హనుమకొండ చౌరస్తా, నవంబర్ 12: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో ఎలుకలు సంచరిస్త్తున్నాయి. ఉన్నతాధికారులు, వైద్యుల పట్టింపులేనితనంతో దవాఖానకు వచ్చేవారికి ఇబ్బందులు తప్పడంలేదు. సోమవారం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆస్పత్రిని తనిఖీ చేసి దవాఖానకు వచ్చేవారికి మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.
జీఎంహెచ్లోని 12వ నంబర్ లేబర్రూంకు వెళ్లేదారి, వార్డు పక్కన, ఆపరేషన్ థియేటర్ పక్కన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఎలుకలు ఎక్కువయ్యాయి. వర్షం పడితే డ్రైనేజీ నుంచి పక్కనే నిత్యం వాటి సంచారం ఉంటుందని పేషెంట్లు వాపోతున్నారు. ఆహార పదార్థాలను తింటుండంతో దవాఖానకు వచ్చేవారు భయాందోళన చెందుతున్నారు.
రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సమస్య ఉన్నా, పలుమార్లు అధికా రులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఎలుకల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.