ములుగు, మే 9 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో రామప్పలో ఈ నెల 14న పర్యాటకుల సందర్శన పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ శబరీశ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 14న మిస్వరల్డ్ పోటీల్లో సుందరీమణుల్లో 35 మంది రామప్ప వస్తున్నందున పాలంపేట ఆర్చి లో పలికి మధ్యాహ్నం 2గంటల తర్వాత ఎవరికీ అనుమతి లేదన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలను ఎగరవేయడం నిషేధమని పేర్కొన్నారు.
మీడియా సెంటర్లోనే పాత్రికేయులకు అనుమతి ఉంటుందని, అక్కడినుంచి ముందుకెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. సాయం త్రం 4గంటలకు రామప్పకు ప్రపంచ సుందరీమణులు చేరుకుంటారని, వారి పర్యటన మూడు గం టల పాటు సాగుతుందని వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ రామప్ప ఆలయం సహా పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఉంటుందన్నారు. పోలీస్ యంత్రాంగానికి అందరూ సహకరించాలని కోరారు.