జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : పాతికేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కలగానే మిగిలిపోతుందా? దీంతో ఈ ప్రాంతం కోల్ కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందనే స్థానికుల ఆశలు అడియాశలుగానే ఉండనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కలుపుతూ మణుగూరు వరకు 207 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ పనులు సర్వేలతోనే ఆగిపోతున్నాయి.
గతంలో 2014లోనే రూ. 10 కోట్లు కేటాయించి 2017 వరకు సర్వే చేపట్టారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా రైల్వే శాఖ భూ సర్వే, సేకరణ కోసం రూ. 2,911 కోట్ల అంచనాతో నిధులు కేటాయించి బాధ్యతలను ఆయా ప్రాంతాల్లోని ఆర్డీవోలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇందుకు సంబంధించి విధి విధానాలు ప్రకటించకపోవడం, రూట్ మ్యాప్ అందించకపోవడంతో సర్వేపై సందిగ్ధత నెలకొంది.
మణుగూరు, భూపాలపల్లి, రామగుండం ఏరియాల్లో నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తి అవుతుండగా, దీనిని తరలించేందుకు ఈ మార్గం తప్పనిసరి. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో బొగ్గు రవాణాకు అధిక వ్యయం అవుతున్నది. రామగుండం-మణుగూరు రైల్వే లైన్ పూర్తయితే సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సులభతరమవుతుంది. దీనివల్ల ఈ ప్రాంతం కోల్కారిడార్గా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. మణుగూరు నుంచి రామగుండం వరకు 9 రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.
భవిష్యత్‌లో బొగ్గుతో పాటు ప్రయాణికుల రైలు నడిపే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రామగుండం నుంచి కొత్తగూడెం మీదుగా మణుగూరు వెళ్లాలంటే 349 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నది. అయితే తాజాగా రైల్వే శాఖ రామగుండం నుంచి మణుగూరు వరకు 207.80 కిలోమీటర్ల పొడవునా సర్వే చేసి, భూ సేకరణ జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలోని మల్హర్, భూపాలపల్లి, గణపురం మండలాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం, మంథని, రామగిరి మండలాల పరిధిలో సర్వేకు ఆర్డీవో, సబ్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌కు సంబంధించి మాకు ఇంకా ఎలాంటి విధి విధానాలు అందలేదు. రూట్ మ్యాప్ కూడా రాలేదు. భూ సేకరణ చేయాలని మాత్రం ఉత్తర్వులు వచ్చాయి. ఏయే గ్రామాల నుంచి మార్గం వెళ్తున్నదనే మ్యాప్ రావాలి. క్షేత్ర స్థాయిలో ఆదేశాలు వచ్చాకే సర్వే ప్రారంభిస్తాం.
– మంగీలాల్, ఆర్డీవో, భూపాలపల్లి