నమస్తే తెలంగాణ నెట్వర్క్ ; వరుస వర్షాలు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను నాశనం చేసి నిండా ముంచుతున్నాయి. ఇక ఎండలు ముదిరి.. వరి కోతలు మొదలుపెడుదామనుకున్న సమయంలోనే చెడగొట్టు వానలు అందుకున్నాయి. వారం రోజైలైనా వదలకుండా వర్షాకాలం మాదిరిగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు వడగండ్లతో ఇటు చేన్లన్నీ మునిగిపోతుండగా, పలుచోట్ల కల్లాల్లో వడ్లు మొలకెత్తుతున్నాయి. అలాగే ఈదురుగాలలుకు మామిడికాయలన్నీ రాలిపోతుండగా మక్కజొన్న కర్రలన్నీ నేలవాలాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవార్లు ఉమ్మడి జిల్లా అంతటా కురిసిన భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలను కోసి అమ్ముకోవాల్సిన రైతులు.. ఇప్పుడు తడిసిన ధాన్యం, మక్కలు, మిర్చిని ఆరబెట్టుకుంటూ తమ కష్టం వానపాలైందంటూ ఆవేదన చెందుతున్నారు. అంతేగాక ప్రకృతి ప్రకోపానికి పెద్ద సంఖ్యలో మూగజీవాలు సైతం మృత్యవాతపడ్డాయి. విద్యుత్స్తంభాలు విరిగిపడడంతో పాటు కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, మరికొన్ని కూలిపోయాయి.
అధైర్యపడొద్దు.. సర్కారు ఆదుకుంటుంది..
రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధుల భరోసాపంట నష్టాలపై ఆందోళన పడొద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు భరోసానిస్తున్నారు. బుధవారం కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న వరి, మక్కజొన్న పంటలను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించి ధైర్యం చెప్పారు. నష్టాన్ని అంచనా వేసి త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం, కొత్తగూడెం, మంగళిబండతండాలో పంటలను జనగామ కలెక్టర్ శివలింగయ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేర్వేరుగా పరిశీలించారు. నర్మెట మండలవ్యాప్తంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సుడిగాలి పర్యటన చేసి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు.