నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో జలకళ వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇలా వరుసగా పడుతున్న వానలతో వాగులు, వంకల్లో వరద నీరు వచ్చి చేరి ఉధృతంగా పారుతున్నాయి. అలాగే చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. జలశయాల్లోనూ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈసారి కొంత ఆలస్యమైనప్పటికీ మంచి వర్షాలు పడుతుండడంతో రైతులు సంబురపడుతున్నారు. పలుచోట్ల వర్షంలోనూ రైతులు, కూలీలు నాట్లు వేస్తూ వ్యవసాయ పనులు చేయడం కనిపించింది. అలాగే వరద ధాటికి పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అటు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం వద్ద ఆరున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఇలా గంటగంటకూ నదీ ప్రవాహం పెరుగుతుండడంతో ముంపు ప్రాంత ప్రజానీకాన్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది.
– నమస్తే నెట్వర్క్
జోరుగా చేపల వేట
ఓ వైపు వర్షాలతో చెరువులు నిండి మత్తడి పోస్తుండడంతో ఇటు మత్స్యకారులతో పాటు సామాన్య ప్రజలు సైతం చేపల వేటలో పడ్డారు. వరంగల్ నగరంలోని వడ్డేపల్లి, సోమిడి చెరువుల మత్తడి వద్ద వర్షంలోనూ వలలు వేయడం కనిపించింది. గొడులు పట్టుకొని మరీ ఉత్సాహంగా చేపలు పట్టారు. అంతేగాక జలకళ సంతరించుకున్న చెరువులు, వాగులు, రిజర్వాయర్ల అందాలను చూసేందుకు ప్రజలు సైతం తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
పలుచోట్ల నిలిచిన రాకపోకలు
హైదరాబాద్-భూపాలపట్నం వెళ్లే 163వ జాతీయ రహదారి వాజేడు మండలం టేకులగూడెం వద్ద వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ర్టాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ దారి గుండా వెళ్లకుండా అధికారులు హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటుశారు. అలాగే జనగామ జిల్లా వెల్దండ-అమ్మాపురం రహదారిపై కల్వర్టు నుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు ఇబ్బంది పడ్డారు. అలాగే జనగామ మండలం వెంకిర్యాలలో వరద ఉధృతికి కాల్వకు గండి పడింది.