హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 22 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం ప్రజా గ్రంథాలయం దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ – ములుకనూరు ప్రజా గ్రంథాలయం’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉత్సాహంగా సాగింది. ఈ వేడుకకు వందలాది మంది కవులు, రచయితలు, పాఠకులు హాజరై ‘నమస్తే తెలంగాణ’ సాహిత్యాభివృద్ధి కోసం చేపట్టిన కథల పోటీల ప్రయత్నానికి జేజేలు పలికారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మహిళా రచయిత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వార్తా పత్రికలు సాహిత్య మూలాలను పూర్తిగా వెనక్కి నెట్టేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ‘నమస్తే తెలంగాణ’ కథల పోటీలు నిర్వహించడంతో పాటు వాటిని తమ పత్రికలో ప్రచురించడం అభినందనీయమన్నారు. ఉదయం 11 గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా పాల్గొన్న యువతీ యువకులు చివరి వరకు కూర్చున్నారు.
కథా పోటీల్లో విజేతలైన రచయితలు తమ కుటుంబసభ్యులతో పాటు వేడుకకు హాజరయ్యారు. ప్రజా గ్రంథాలయానికి పలువురు కవులు, ఆహుతులు విరాళాలు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గ్రంథాలయానికి పలు పుస్తకాలను బహూకరించారు. ఈ సందర్భంగా మత్తి భానుమూర్తి రచించిన ‘జాయ సేనాపతి’ చారిత్రక కాల్పనిక నవలను సభా వేదికపై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో ప్రతివారం నవల ప్రచురితమవుతుందన్నారు. ‘నమస్తే తెలంగాణ’తోనే తనకు గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చాగోష్టిలో కవులు, రచయితలు పాల్గొన్నారు. క్విజ్ పోటీల విజేతలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ బహుమతులు అందజేశారు. అంతకంటే ముందు ముల్కనూరు సా హితీ పీఠం ఏర్పాటు చేసిన డోలు కళాకారుల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. పలువురు విద్యార్థులు, కళాకారులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొమ్మిడి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.