గొప్పలకు పోయి మంత్రులు చేసిన ఆర్భాటపు ప్రకటనలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అలా వచ్చి ఇలా మోటర్లను ఆన్ చేసి ‘దేవాదుల 3వ దశ’ను తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొందామని భావిస్తే పరిస్థితులు తలకిందులై వారినే అభాసుపాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతుండగా నీళ్లిచ్చే విషయంలోనూ హడావుడి ప్రయత్నాలకు సాంకేతిక సమస్యలు తోడయ్యాయి. ఎంత ప్రయత్నించినా మోటర్లు ఆన్కాక మొరాయిం చి పంపింగ్ ఆలస్యమవుతుండడంతో మంత్రులు తలలు పట్టుకొని ‘అసలు పంపులు ఎప్పుడు నడుస్తాయో చెప్పండయ్యా’ అంటూ బతిమిలాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా శనివారం ఆస్ట్రియా నుంచి ప్రొటోకాల్ ఇంజినీర్ వచ్చి పరిశీలించి అనుమతి ఇచ్చాకే మోటర్లు ఆన్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
– వరంగల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
దేవన్నపేటలోని పంపుహౌస్‌లో మోటర్లను ఆన్ చేసి అదనంగా 60వేల ఎకరాలకు నీరిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నీటి సరఫరా లేక పంటలు ఎండిపోతుండగా ముఖ్యంగా వరి వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. గోదావరిలో నీరున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దేవాదుల పరిధిలోని పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దేవన్నపేట పంపుహౌస్‌లోని మోటర్లను ఎండల తీవ్రతకు ముందే, రెండు వారాల క్రితమే ఆన్చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆన్ కావడం లేదు.
సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మూడు రోజుల క్రితమే వచ్చి మోటర్లు ఆన్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వ నిర్వహణ లోపం, సాంకేతిక సమస్యలతో అవి ఆన్ కాలేదు. ఒక్కరోజులోనే మోటర్లను ఆన్ చేస్తామని మంత్రులు, సాగునీటి శాఖ అధికారులు రోజూ ప్రకటిస్తున్నారు. ఎప్పుడు ఆన్ చేస్తారనేదిపై స్పష్టత లేదు. ఈ పంపుహౌస్‌లో భారీ సామర్థ్యం ఉన్న మూడు మోటర్లు ఉండగా ఆస్ట్రియా కంపెనీ వీటిని అమర్చింది. నిర్వహణ సైతం కంపెనీ ఆధ్వర్యంలోనే ఉంటున్నది.
రెండు రోజులుగా ఆ కంపెనీ ఇంజినీర్లు మోటర్లలోని సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పనులు పూర్తయినా ఆస్ట్రియా కంపెనీకి చెందిన ప్రొటోకాల్ ఇంజినీర్ అనుమతి ఇచ్చిన తర్వాతే మోటర్లను ఆన్ చేస్తామని సాగునీటి శాఖ ఉన్నతాధికారి చెప్పారు. సదరు ఇంజినీర్ శనివారం రానున్నట్లు సమాచారం. ఆ ఇంజినీర్ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాతే మోటర్లు ఆన్ అయ్యే పరిస్థితి ఉన్నదని సాగునీటి శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆస్ట్రియా ఇంజినీర్ వచ్చిన తర్వాత ఇంకేమైనా సాంకేతిక సమస్యలను గుర్తిస్తే పంపులను ఆన్ చేయడం మరింత ఆలస్యమవుతుందని చెప్పారు.
కేసీఆర్ హయాంలోనే దేవన్నపేట పంపుహౌస్ పూర్తయ్యింది. కానీ కాంగ్రెస్ ఘనతగా చెప్పుకొనేందుకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మోటర్లను ఆన్ చేస్తున్నట్లు ప్రకటించి, ఈ నెల 18న దేవన్నపేటకు వచ్చారు. అక్కడ రెండు గంటలున్నా మోటర్లు ఆన్ కాలేదు. చేసేది లేక రాత్రి వరకు ఆన్ చేస్తామని, మోటర్లు నడిచిన తర్వాతే హైదరాబాద్ వెళ్తామని ఆర్భాటంగా ప్రకటించారు. సాగునీటి అధికారులు వాస్తవ పరిస్థితిని వివరించడంతో మోటర్లు కావని గ్రహించి అదే రాత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆన్అయ్యే వరకు వరంగల్‌లోనే ఉంటామని ప్రకటించిన మంత్రులకు మూడు రోజులుగా ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నది. మోటర్లు ఎప్పటిటి ఆన్ ఆవుతాయో చెప్పాలని ఇద్దరు మంత్రులు పదేపదే సాగునీటి శాఖ ఉన్నతాధికారులను ఆరా తీస్తున్నారు.
తాము హడావుడిగా ఆన్ చేసినా పంపులు రన్ కాకపోవడంతో ఈ విషయం చర్చనీయాంశమైందని.. పంపులు త్వరగా ఆన్ అయ్యేలా చూడాలని బతిమాలుతున్నారు. పంపింగ్‌పై సాగునీటి శాఖ ఎలాంటి ప్రయోగాత్మక చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. పంపింగ్ మొదలుపెట్టే ముందు మొదట డ్రైరన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా కొద్దిసేపు పంపింగ్ చేయాలి. అవేమీ చేయకుండా పబ్లిసిటీ కోసం మంత్రులు వచ్చి నేరుగా పంపింగ్ కోసం ఆన్ చేయాలనుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఇప్పుడు అదే విషయమై రైతుల్లో చర్చ జరుగుతున్నది. మోటర్లు ఆన్ అయితే గంటలలోనే తమ ప్రాంతాలకు నీళ్లు వచ్చేవని, మంత్రులు చెప్పిన మాటలకు నీటి రాకకు పొంతన కుదరడం లేదని రైతులు అంటున్నారు.