ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. రెండో రోజైన బుధవారం నిర్వహించిన గ్రామ సభల్లో నిరసనలు హోరెత్తాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు ఎటుపోయాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులకు ఎలా చోటు కల్పించారంటూ మండిపడ్డారు. ముందే తయారు చేసిన జాబితాలోని పేర్లు చదవడానికి గ్రామ సభలెందుకని ప్రశ్నించారు.
మొదటి రోజు ఆందోళనలు అధికమైన నేపథ్యంలో రెండో రోజు భారీ బందోబస్తు మధ్య పోలీసులు కార్యక్రమాలను నిర్వహించారు. పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలా పెద్ద పీట వేస్తారంటూ ఆగ్రహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధిస్తూ అధికారులను నిలదీయడంతో పాటు వాగ్వాదం చేస్తున్న మహిళలు, పురుషులను ఖాకీలు అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేయడంతో పాటు వీడియోలు తీశారు.
పథకాల అమలు నిరంతరం కొనసాగుతుందని, పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు సూచించారు. చేసేదేమీ లేక మరోసారి దరఖాస్తులు ఇచ్చి అధికారులను తిట్టుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా, పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగి దాడికి పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా గందరగోళం మధ్యనే గ్రామ సభలు కొనసాగాయి.
– నమస్తే నెట్వర్క్, జనవరి 22
నర్సంపేట : కాంగ్రెస్ ప్రభుత్వంలో మా బతుకంతా ధరఖాస్తులు పెట్టడానికే సరిపోతున్నది. మేము కాంగ్రెస్ కార్యకర్తలం, నాయకులం కాదు. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లం. చెరువు కింద మామూలుగా ఇంటి నిర్మాణం ఇప్పుడిప్పుడే చేపట్టాం. గతంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం ధరఖాస్తు పెట్టుకున్నాం. ఏడాది గడిచినా అతీగతీ లేదు. మళ్లీ ఇప్పుడు ధరఖాస్తు చేసుకోవాలన్నరు. రాజకీయ పలుకుబడి ఉన్నోళ్ల పేర్లు లిస్టులో ఉంటానయ్. మాలాంటి పేదల పేర్లు ఎందుకు ఉంటలేవు?
– ఈరబోయిన రజిత, ఇటుకాలపల్లి, నర్సంపేట
బతుకుదెరువు కోసం నేను హైదారాబాద్‌కు పోయి పని చేసుకుంటున్న. నాకు ఇల్లు లేదు. పడమటిగూడెంలో గ్రామసభ ఉందని తెలిసి వస్తే జాబితాలో నా పేరు లేదు. ఆత్మీయ భరోసా లేదు. బాగా ఉన్నోళ్ల పేర్లే లిస్టులో రావడంతో అధికారులను అడుగుతుంటే 10 ఏళ్లుగా ఏం చేసినవ్ అంటు అగౌరవంగా కాంగ్రెసోళ్లు తిడుతున్నరు. నాకు న్యాయం చేయాలని అడిగితే అధికారులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిండ్రు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఆశ వర్కరుగా పని చేసిన. పైసలు సక్రమంగా రాకపోతే హైదారాబాద్‌కు పోయిన.
– గూడెల్లి రమ, పడమటిగూడెం, నర్సింహులపేట
బచ్చన్నపేట : మండలం లోని అలీంపూర్ గ్రామానికి చెందిన సిరిపాటి స్వరూప కొ న్నాళ్లుగా బచ్చన్నపేటలో ఉం టున్నది. ఇందిరమ్మ ఇళ్లు కో సం దరఖాస్తు పెట్టుకుంది. బుధవారం జరిగిన గ్రామస భ సందర్భంగా జాబితాలో పేరు లేకపోవడంతో అక్కడే కంటతడి పెట్టింది. అర్హులకు ఇండ్లు ఇవ్వాలని, బంగ్లాలు న్న వారికి కాదని, తాను అద్దె ఇంట్లో ఉంటున్నా తన పేరు రాలేదంటూ మండిపడింది.
ఎన్నో ప్రభుత్వాలను చూశాం. ఇట్లాంటి గ్రామ సభలను యాడ చూడలే. గతంలో కష్టం చెప్పుకోవడానికే అప్పటి ప్రభుత్వాలు గ్రామ సభలు పెట్టినయి. ఇప్పుడేమో కట్టెలు, తుపాకులు పెట్టి పోలీసులతో కష్టం చెప్పుకునే వారిని బెదిరిస్తూ బయటకు లాగేస్తున్నరు. గ్రామ సభకు ఇంతమంది పోలీసులు అవసరమా? ఇదేం పాలన. ఇద్దరు కూతళ్లతో ఇల్లు లేక ఎన్నో ఏండ్లుగా కిరాయికి ఉంన్న. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేరు రాలే. ఉన్న వాళ్లకు పథకాలు ఇచ్చేందుకేనా ఓట్లేసింది. మళ్లా మా రోజులు వత్తయి.. గప్పుడు చూస్తం అయ్యగాండ్ల ఆట.
– మహ్మద్ షాహీద్, నల్లబెల్లి