టేకుమట్ల, ఫిబ్రవరి 17 : మానేరు, చలివాగులు ఎండిపోయి అన్నదాత ఆగమవుతుంటే అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కనీసం స్పందించడం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. డీబీఎం 38 కెనాల్, మానేరు, చలివాగుకు నీటిని విడుదల చేసి వేల ఎకరాల్లో సాగుచేస్తున్న పంట పొలాలను కాపాడి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల-గుమ్మడవెల్లి మధ్యలోని చలివాగుపై ఎండిపోయిన చెక్‌డ్యాం వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ వృథాగా సముద్రంలోకి వెళ్తున్న జలాలను బీడు భూములకు మళ్లించి సస్యశ్యామలం చేశారని, కానీ, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు. తమ హయాంలో డీబీఎం 38 కెనాల్ ద్వారా చివరి ఆయకట్టుకూ నీరందించామని, ప్రస్తుతం కాల్వ మొత్తం ముళ్లపొదలతో నిండిపోయిందన్నారు. కాకతీయ కెనాల్ ద్వారా చలివాగులోకి నీటిని తరలించడంతో రెండు పంటలు సాగయ్యాయన్నారు. వెంటనే చలివాగులోని చెక్‌డ్యాం నింపాలని, డీబీఎం కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గండ్ర హెచ్చరించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలియక పెద్ద తప్పు చేశామని, ఫలితం అనుభవిస్తున్నామని, అప్పులు చేసి బావులు తవ్వించుకుంటున్నా చివరకు పంట చేతికి వస్తుందనేది నమ్మకం లేదన్నారు. త్వరలో మంచి రోజులు వస్తాయని గండ్ర వారికి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్ల రవిగౌడ్, మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల నరేశ్, కార్మిక శాఖ మండలాధ్యక్షుడు నేరెళ్ల రామకృష్ణాగౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, మహేశ్, ఆది రఘు, ఉమేందర్, అక్రం, రాజు, స్వామి, లక్ష్మణ్, చంద్రయ్య, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.