వరంగల్ చౌరస్తా: నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తూ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వాఖ్యలను హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఎర్డీఏ) వరంగల్ విభాగం, కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఈ నెల 19న ఆర్ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని ఆయన కోరడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం వరంగల్లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోమవారం కేఎంసీ ప్రధాన గేట్ ముందు నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి ప్రాణాలు నిలిపే వైద్య వృత్తిని దొంగచాటుగా, చట్టాన్ని అతిక్రమించి చేస్తున్న నకిలీ వైద్యులను ప్రోత్సహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను అందుబాటులోకి తేవాలని, మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఆరోగ్య రంగానికి, సమాజానికి తీవ్ర నష్టం కలిగించే నకిలీ వైద్యులకు ప్రోత్సహించడం ప్రజలకు చేస్తున్న ద్రోహంతో సమానమని ఆన్నారు. ఇప్పటికైనా ప్రొఫెసర్ కోదండరాం తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ విద్యార్థులు, హెచ్ఎర్డిఏ సభ్యులు పాల్గొన్నారు.