జనగామ రూరల్, సెప్టెంబర్ 30 : వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు టైర్ పేలి బోల్తా పడిన ఘటన జనగామ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జనగామ మండలంలోని యశ్వంతాపూర్ వద్ద బెంగళూరు నుంచి 25 మంది ప్రయాణికులతో వరంగల్ వస్తున్న ప్రైవేట్ బస్సు టైరు పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రంగా, మరో 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని జనగామ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడుకు చెందిన పోచయ్యకు చేయి విరగడంతో ఇక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం వరంగల్ పంపించారు. మిగతా వారు తమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరు ఉపిరి పీల్చుకున్నారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.