జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రకటించిన భారత్ రైస్ జాడ లేకుండా పోయింది. ప్రారంభించి తొమ్మిది నెలలైనా పేదోడికి సబ్సిడీపై సన్న బియ్యం అందని ద్రాక్షగానే మిగిలింది. రూ. 29కే భారత్ రైస్ (సన్న బియ్యం) ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 7న అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ సంస్థలు, మొబైల్ ఔట్లెట్ల ద్వారా భారత్ రైస్‌ను 5, 10 కిలోల బ్యాగుల్లో విక్రయించనున్నట్లు ప్రకటించారు.
అయితే నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సెంటర్లు ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఎక్కడా కానరావడం లేవు. అసలు రాష్ట్రవ్యాప్తంగానే భారత్ రైస్ విక్రయాలు జరగడం లేదని అధికారులు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ ఆడంబరంగా ప్రారంభించిన భారత్ రైస్ హామీ అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరి ఉత్పత్తి పెరిగినప్పటికీ.. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో సామాన్యులకు ఊరట కలిగించేలా ప్రకటించిన భారత్ రైస్ హామీ ఆదిలోనే ఆగిపోయింది.
మార్కెట్లో సోనా మసూరి, జై శ్రీరాం లాంటి వెరైటీలు కిలోకి రూ. 60 నుంచి రూ. 80 వరకు ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన భారత్ రైస్ పేదల్లో ఆశలు రేకెత్తించింది. సన్న బియ్యం అందుబాటులోకి వచ్చాయని భావించినప్పటికీ ఇది ఆదిలోనే ఆగిపోయింది. ఫలితంగా గరీబోళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ సంస్థల ద్వారా బియ్యం విక్రయాల అడ్రస్ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో అసలు భారత్ రైస్ విషయమై ప్రజలకు అవగాహన లేకుండాపోయింది. అధికారులకు సైతం సమాచారం లేని పరిస్థితి నెలకొంది.
ప్రారంభోత్సవ సమయంలో నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండా ర్ సంస్థల సెంటర్లు, మొబైల్ ఔట్లెట్ల ద్వారా భారత్ రైస్‌ను 5, 10 కిలోల బ్యాగుల్లో విక్రయించనున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు ఈ విషయమై మాకు ఎలాంటి సమాచారం లేదు.
– రాములు, పౌరసరఫరాల అధికారి, భూపాలపల్లి జిల్లా