నమస్తే నెట్వర్క్, నవంబర్ 4: పెండింగ్ బిల్లులు చెల్లించాలని శాంతియుత ధర్నా చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ సర్పంచ్లు సోమవారం హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారక ముందే ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ బిల్లుల కోసం తాము చేపట్టనున్న శాంతియుత ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో సీఎం పాలననా లేక పోలీస్ పాలన జరుగుతుందా అనేది అర్థం కావడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం తాము అప్పులు చేసి పనులు చేశామని, వడ్డీలు కట్టలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా తమ పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.