కాశీబుగ్గ, అక్టోబర్ 25: రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్న బీఆర్ఎస్తో పోటీపడడం ఏ పార్టీకీ సాధ్యం కాదని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష నేతలు గులాబీ కండువాలు కప్పుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 34, 36వ డివిజన్ల అధ్యక్షులు పరిమల్ల భిక్షపతి, ఎస్కె సోహెల్ ఓసిటీలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నన్నపునేని వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే నరేందర్ తూర్పు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌ను వీడినట్లు తెలిపారు.
గత పాలకులు వరంగల్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను అడ్డుపెట్టుకొని వారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారే తప్ప.. ఏనాడు నియోజకవర్గం మంచి కోరలేదని విమర్శించారు. వరంగల్ తూర్పు ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తిగా నన్నపునేని ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పును అభివృద్ధికి కేరాఫ్‌గా మారుస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా పని చేసిన నాయకులే బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత న్యాయం కల్పిస్తామని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవీణ్, ఫూర్కాన్, నాయకులు శ్రీనివాస్, షర్పోద్దీన్, సురేశ్, యాకయ్య, గుల్బర్, అక్బర్, సురేశ్, రాంకీ, లడ్డూ పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 32వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు బత్తుల కుమార్ సొంతగూడికి చేరారు. ఈ సందర్భంగా కుమార్‌కు ఎమ్మెల్యే నరేందర్ గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి కుమార్ సొంతగూటికి చేరడం సంతోషంగా ఉందని నన్నపునేని అన్నారు. కార్యక్రమంలో సాగర్, రాంకీయాదవ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.