మహబూబాబాద్ రూరల్/ మడికొండ/ దామెర, మే 18 : కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ ప్రజలను మోసం చేసే హామీలే తప్ప ఒక్కటి అమలు చేయలేదని, పట్టభద్రులు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శనివారం జరిగాయి. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే బానోత్ అధ్యక్షతన పట్టణంలోని బాలాజీగార్డెన్లో, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో, పరకాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కేసీఆర్ ప్రభుత్వం మహబూబాబాద్ మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్, నర్సింగ్, ఉద్యాన కళాశాలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హబ్‌గా చేసిందన్నారు. కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నిక ఆశయానికి, అహంకారానికి మధ్య జరుగుతోందని, పేదల సమస్యలను గాలి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ అహంకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రచారం చేస్తోందన్నారు. రాకేశ్‌రెడ్డి వంటి మేధావులను చట్టసభల్లో కూర్చోబెట్టాలని కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకను అవుతానని తెలిపారు. ఐదు నెలలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన వాటికి జాబ్ సర్టిఫికెట్స్ అందజేసి తామే జాబ్‌లు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రమ కల్పిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్, చీటర్ ఇప్పటికే నాలుగు పార్టీలు మారాడని పేర్కొన్నారు. ఆయనపై 56 క్రిమినల్ కేసులు ఉన్నాయని, మోసగాడు కావాల్నా విద్యావంతుడు కావాలో పట్టభద్రులు ఆలోచించాలని, తాను జాబ్ మేళాలు నిర్వహించి 692 మంది నిరుద్యోగలకు ఆఫర్ లెటర్స్ అందించినట్లు చెప్పారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీరవెల్లి భరత్‌కుమార్, యాకుబ్‌రెడ్డి, లునావత్ అశోక్‌నాయక్, మల్లయ్య, కవితా రాంజీ నాయక్, వెంక న్న, జడ్పీటీసీలు పోలీస్ ధర్మారావు, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి ఖాయం. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు వచ్చేవి. తెలంగాణ వచ్చినంక 95శాతం తెలంగాణ బిడ్డలకే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఎంతో చైతన్యం గల పట్టభద్రులు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.
-ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి