వరంగల్ చౌరస్తా, మే 30 : వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ప్రసూతి కోసం వస్తే ప్రాణాలు పోయే స్థితికి తీసుకొచ్చారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు హాస్పిటల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మే 25వ తేదీ ఆదివారం రాత్రి 10గంటల సమయంలో కాశికుంట ప్రాంతానికి చెందిన నజియాబేగం(32) నాల్గో కాన్పు నిమిత్తం కుటుంబ సభ్యులు సీకేఎం హాస్పిటల్కు తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స చేయగా, బాబుకు జన్మనిచ్చింది.
శస్త్రచికిత్స అనంతరం 4 గంటలపాటు ఆపరేషన్ థియేటర్ నుంచి ఆమెను బయటకు తీసుకురాలేదు. కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా ఐసీయూకి తరలించారు. శుక్రవారం ఉదయం వైద్యులు పరీక్షించి నజియాబేగం ఆర్యోగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే ఎంజీఎం దవాఖానకు తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు ఎంజీఎం తీసుకెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో కేస్షీట్ కనిపించడం లేదని సిబ్బంది తెలియజేయడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు కావాలనే కేస్షీట్ కనిపించడం లేదని చెబుతున్నారని, వైద్యం వికటించడంతోనే బాధితురాలి పొట్ట భాగం ఉబ్బిందని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు.
ఈ విషయంపై సీకేఎం హాస్పిటల్ ఆర్ఎంవో డాక్టర్ మురళిని వివరణ కోరగా.. వైద్య పరీక్షల కోసం తరలించిన సమయంలో కేస్షీట్ కనిపించకుండా పోయిన మాట వాస్తవమేనని, సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి ఎంజీఎం దవాఖానలో పరీక్షలు నిర్వహించి, సిటీ స్కాన్ చేయడం జరిగిందని, ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉందన్నారు. కేస్షీట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యాధికారుల వివరణపై కుటుంబసభ్యులు సంతృప్తి చెందక కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.