వరంగల్ లీగల్, సెప్టెంబర్ 8 : ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం’ అన్న ప్రజాకవి కాళోజీ స్ఫూర్తితో హనుమకొండలో అత్యంత విలువైన 18.17 ఎకరాల ప్రభుత్వ భూమిని (హయాగ్రీవాచారి కాంపౌండ్) ప్రజా న్యాయవాది సాయం శంకరయ్య అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. ఇలా ప్రభుత్వానికి దక్కిన స్థలంలోనే ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తయ్యింది.
జనతా పార్టీ నాయకుడు, సోషలిస్టు, సీనియర్ న్యాయవాది సాయం శంకరయ్య భూ ఆక్రమణదారుల కుట్రలను పసిగట్టి ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు వెరవకుండా విలువైన భూమిని కాపాడి భావితరాలకు అందించారు. 1980లో హనుమకొండ రెవెన్యూ పరిధిలో బాలసముద్రంలో సర్వే నంబరు 1066లోని 18.17 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆ రోజుల్లో వరంగల్ జిల్లాను శాసించిన నాయకుడి అనుచరులు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించి కబ్జాకు యత్నించారు.
నిజాం ప్రభుత్వ ప్రతినిధికి ఆ రోజుల్లో ఓ నిరుపేద భూమి కేటాయింపు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రతినిధి దరఖాస్తుపై విచారణ చేయండి (గైర్ కియా జాయే)అని ఉర్దూలో రాశారు. భూమిని కబ్జా చేయాలనే కుట్రతో అప్పటి కీలక ప్రజాప్రతినిధి అనుచరులు ఉర్దూ పదాన్ని విచారణ చేయండి.. అనే బదులుగా మంజూరు చేయండి.. అని తప్పుగా అన్వయించి రికార్డులు సృష్టించి భూమిని తమ పేర మార్చుకున్నారు. ఆ తర్వాత భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను తయారు చేసుకునేందుకు వరంగల్ జిల్లా కోర్టులో టైటిల్ కోసం సివిల్ దావా వేశారు.
బాకరాజు రాఘవరత్నం, ఇతరుల కేసు (ఓఎస్ 108 ఆఫ్ 1980 నంబర్)గా ఇది ప్రాచుర్యం పొందింది. ఈ విషయం తెలిసిన న్యాయవాది శంకరయ్య న్యాయపోరాటం మొదలుపెట్టారు. కోర్టుకు నిజానిజాలు తెలియ చేయాలని నిర్ణయించుకుని, అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌ను సంప్రదించారు.
ఓంకార్ సూచనతో హనుమకొండ పట్టణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి గంధమల్ల రాములుతో ఇంప్లీడ్ పిటిషన్ (ఆర్డర్ 1 రూల్ 10 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్) వేసి కబ్జా కుట్రలను అందరికీ తెలియజెప్పారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన కబ్జాదారులు అప్పటి ప్రభుత్వ ప్లీడర్ అండతో తమకు అనుకూలంగా ఆర్డర్ వచ్చేలా ప్రయత్నించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ప్రభుత్వ న్యాయవాది ఉద్దేశ పూర్వకంగా క్రియాశీలకంగా లేకపోవడంపై ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓంకార్..
పీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇద్దరు కలిసి అసెంబ్లీలో ప్రస్తావించడంతో సీనియర్ న్యాయవాది భగవాన్ దాస్ మాంధానిని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు.
గంధమల్ల రాములు, భగవాన్ దాస్ మంధాని, సాయం శంకరయ్య ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసును ‘భూ కబ్జా’ పరిధిలోకి తీసుకువచ్చేలా చేశారు. ఆ భూమిపై ప్రభుత్వానికి తప్ప ఇతరులకు ఎలాంటి హకు లేదని సాక్షాలతో నిరూపించారు. బాకరాజు రాఘవరత్నం వేసిన కేసును కొట్టి వేస్తూ బాలసముద్రంలోని 18.17 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ భూమిలోని 4.24 ఎకరాల్లోనే కేసీఆర్ ప్రభుత్వం కాళోజీ పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించగా, ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది.