కమలాపూర్, మే 30 : కోట్లాది నిధులు వెచ్చించి నిర్మించిన ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ప్రారంభానికి ముందే పాడయ్యింది. తెలంగాణలోనే అతిపెద్ద నాలుగు లేన్ల ఈ వంతెన గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారింది. దీనిపై ప్రయాణం కష్టంగా మారడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద గత బీఆర్ఎస్ హయాంలో పరకాల-హుజురాబాద్ రహదారిపై ఆర్వోబీ నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాకింద రూ. 60 కోట్లతో పనులు పూర్తిచేసింది. తన వాటాకింద రూ. 40 కోట్లతో మిగిలిన పనులు చేయాల్సిన కేంద్రం నాలుగేండ్లు పెండింగ్‌లో పెట్టింది. అనేక ఒత్తిడిలు, ఆందోళనల నేపథ్యంలో ఇటీవల పూర్తిచేసింది. రైల్వే లైన్‌పై బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో మూడు నెలలుగా దానిపై నుంచి వాహనాలు నడుస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా ప్రారంభించకముందే వంతెనపై గుంతలు పడి ఇనుప చువ్వలు బయటకు తేలి ప్రమాదకరంగా మారడమే కాకుండా ఒకచోట రంధ్రం కూడా పడింది.
కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వారధిగా ఉన్న ఈ బ్రిడ్జిపై వాహనాలు నడిపేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ గ్రానైట్, బొగ్గు లారీలు దీనిపై వేగంగా వెళితే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 29న ఉపాధిహామీ పనులు పరిశీలించేందుకు ఉప్పల్‌కు వచ్చిన కలెక్టర్ దృష్టికి ఆర్వోబీ పరిస్థితిని గ్రామస్తులు తీసుకెళ్లినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.