వరంగల్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఒక లెక్క అయితే ఎనుమాముల మార్కెట్‌ది మరోలెక్క అన్నట్టు సాగుతున్నది. మొత్తం 18 వ్యవసాయ మార్కెట్లలో ఆ మాటకొస్తే ఆసియాలోనే అతి పెద్దదైన ఎనుమాముల మార్కెట్ కమిటీ నియామకానికి పడిన పీఠముడి వీడక, రాజకీయ పంచాయితీ తెగక నోచుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు వర్సెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి సహా ఇతర నేతలు అన్నట్టుగా వారిలో వారే మంటలు పెట్టుకుంటున్నారు.
వార్ బహిరంగంగానే సాగుతున్నది. ఈ క్రమంలోనే ఎనుమాముల మార్కెట్ కమిటీ నియామకం కొలిక్కి రావడం లేదని ఒక వర్గం చెబుతుండగా లేదు ఫైనల్ అయిపోయింది కాకపోతే ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఆగుతుంది అని మరో వర్గం పేర్కొంటున్నది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదిరితే తప్ప ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం సాధ్యం అయ్యే అవకాశం లేదు. అయితే, గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు చైర్మన్‌గిరీ కట్టబెట్టారు.
ఈసారి మాత్రం వర్ధన్నపేటకు అవకాశం ఇవ్వాలని, ఆ మేరకు ఒక పేరును ఫైనల్ చేయడం వంటి ప్రక్రియలు అన్నీ అయిపోయి జీవో సైతం వెలువడే సమయంలో తాజా రాజకీయ దుమారం తెరపైకి రావడంతో అది ఆగిపోయినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక కాటారం మార్కెట్ కమిటీ నియామకం కాలేదు. ఎనుమాముల కమిటీ నియామకానికి పొలిటికల్ వార్ అడ్డొస్తే కాటారంలో ‘స్థానిక’ సంస్థల ఎన్నికల తర్వాత వేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నట్టు సమాచారం. అయితే, మంథని నియోజకవర్గంలోని మంథని, కాటారం రెండు మార్కెట్లు ఉండగా రెండింటికీ వేయకపోవడం గమనార్హం.