వరంగల్‌చౌరస్తా, అక్టోబర్19 : మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాడుతూ రాజకీయ ప్రముఖులు పట్టుబడిన ఘటన వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో కొందరు పేకాడుతున్నట్లు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు, వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన గూడూరు హరిబాబు, కాజీపేట ప్రాంతానికి చెందిన వలుపదాసు సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్‌రోడ్డు శాయంపేట ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, మామునూరు ప్రాంతానికి చెందిన నోముల తిరుపతిరెడ్డి, గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రావర్ల శ్రీనివాసరావు, సయ్యద్ జావీద్, కొత్తవాడకు చెందిన నీలం రాజ్‌కిశోర్ (తెలంగాణ ఉద్యమకారుడు),
రామన్నపేట ప్రాంతానికి చెందిన పరిశల నాగరాజు, పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, చింతం సంతోష్, సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన మేరు వీరేశం ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. వారి నుంచి రూ.3,68,530 నగదు, 15 సెల్ఫోన్లు, కార్డులతోపాటు నగదుకు బదులు వినియోగించే టోకెన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో చింతం సంతోష్‌పై గతంలో పేకాట శిబిరాలు నిర్వహించినట్లు, అధిక వడ్డీకి నగదు లావాదేవీలు కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి. పేకాట శిబిరంలో స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులతో పాటు వ్యక్తులను మట్టెవాడ పోలీసులకు అప్పగించారు.