పరకాల, అక్టోబర్ 16 : ఉన్నతాధికారి విచారణలో నిజాలు చెబితే రౌడీషీట్లు తెరుస్తామని, పీడీ యాక్టు కేసులు పెడుతామని, కేసును ఉపసంహరించుకోవాలని అగ్రంపహాడ్ జాతర బాధితులను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఫిబ్రవరి నెలలో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో పోలీసులు అత్యుత్సాహంతో 12మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను చితకబాదడంతో తీవ్రంగా గాయపడ్డారు.
అప్పట్లో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసనకు స్పందించిన సీపీ.. ఆత్మకూరు ఎస్సై ప్రసాద్‌ను సస్పెండ్ చేసి ఘటనలో ఏసీపీ కిషోర్‌కుమార్, సీఐ సంతోష్‌కుమార్, ఆత్మకూరు, దామెర ఎస్సైలు ప్రసాద్, అశోక్ పాత్రపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇటీవల మామునూరు ఏసీపీ తిరుపతి, భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్‌ను విచారణ అధికారులుగా నియమించారు. కాగా ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగనున్న నేపథ్యంలో వారం రోజులుగా బాధితులకు పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
ఇటీవల బాధిత బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు ఫోన్ చేసి ‘మీతో మాట్లాడే పని ఉంది.. పోలీస్‌స్టేషన్‌కు రావాలి’ అని హుకుం జారీచేసినట్లు తెలిసింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సదరు నాయకులకు అగ్రంపాడ్ ఘటనలో నిజాలను విచారణ అధికారుల వద్ద చెప్పొద్దని, కేను ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు సమాచారం. ‘మీరు ఈ మండలంలోనే ఉంటారు. నిజాలు చెప్పినట్లయితే ఎప్పటికైనా మీపై పీడీ యాక్టులు, రౌడీషీట్లు నమోదు చేస్తాం’ అంటూ హెచ్చరించినట్లు సదరు బాధిత బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా చితబాదిన కేసులో పోలీసులు విచారణను క్షేత్ర స్థాయిలో చెపట్టలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ నుంచి పోలీసులకు నోటీసులు రాగా విచారణ అధికారులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్, మామునూరు ఏసీపీలు ఉన్నారు. కాగా, విచారణలో భాగంగా బాధితులు మంగళవారం భూపాలపల్లి జిల్లాకు, బుధవారం మామునూరు ఏసీపీ కార్యాలయానికి హాజరయ్యారు. విచారణలో భాగంగా కమిటీతో ఎలాంటి సంబంధం లేని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై దుర్గా ప్రసాద్‌ను కూర్చోబెట్టి ఆయన ముందే బాధితులను విచారించినట్లు సమాచారం. బాధితులు నిజాలు చెప్తున్న క్రమంలో సదరు ఎస్సై కమిటీ సభ్యుల ముందే కనుచూపుతోనే బెదిరింపులకు గురిచేసినట్లు బాధితులు ఆరోపించారు.
పోలీసుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేసి అండగా ఉంటాను. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్ అన్నందుకే దేశద్రోహుల్లాగా పోలీసులు అత్యుత్సాహంతో బీఆర్ఎస్ కార్యకర్తలను చితకబాదడం బాధాకరమైన విషయం. వారికి న్యాయం జరిగే విధంగా ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాం. పార్టీ పోరాటం చేయడం వల్లే వెంటనే ఎస్సై దుర్గాప్రసాద్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఘటనపై క్షేత్రస్థాయిలో శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అయితే విచారణలో స్థానిక ఏసీపీ, సీఐ, ఎస్సైలు బాధితులను కేసును ఉపసంహరించుకోవాలని, కమిటీ ముందు నిజాలు చెప్పొద్దని, లేదంటే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని బెదిరింపులు గురిచేస్తున్నారు. విచారణలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గాప్రసాద్‌ను కూర్చోబెట్టి బాధితులను విచారించడం సరికాదు. – చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే