దమననీతి, నిరంకుశత్వం, అరాచకత్వాన్ని కలంతో ధిక్కరించిన ధీశాలి.. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు.. హక్కులనడిగిన ప్రజల మనిషి..ఉద్యమాన్ని నడిపిన ప్రజావాది.. తెలంగాణ జీవిత చలనశీలి.. అక్షర జ్వాలతో జాతిలో చైతన్యం రగిలించిన ప్రజాకవి కాళోజీ జయంతినేడు.. తెలంగాణకు కాళన్న చేసిన సాహితీ సేవను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, కాళోజీ జయంతిని తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించి, అధికారికంగా నిర్వహిస్తూ గౌరవిస్తున్నది. వరంగల్‌లోని ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టింది. కాళోజీ పేరిట నిర్మిస్తున్న కళాక్షేత్రం కూడా పూర్తికావచ్చింది. నేడు కాళోజీ జయంతి ఉత్సవాలను హనుమకొండలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, సాహిత్యకారులు హాజరుకానున్నారు.
కాళోజీ అను‘నది’
‘నఖరా’లు లేనట్టిది
‘నాజూకు’ది కానట్టిది
నానాభావననది
నీనా భావన లేనిది
ఎదచించుక పారునది
ఎదలందున చేరునది
కనుకొలకుల చిలుకునది
కనురెప్పల తడుపునది
హనుమకొండ, సెప్టెంబర్ 8: అణచివేత, అన్యాయం ఎకడ, ఏ రూపంలో ఉన్నా ఎదిరించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు.. వందేమాతర ఉద్యమం, ఆర్యసమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించి నిజాం, భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితిపై గళమెత్తారు. పౌర హకుల ఉద్యమాల్లో ముందుండి నడిచారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటు వేయవద్దని చెప్పడం తప్పని నక్సలైట్లనూ ప్రశ్నించారు. అన్యాయం జరిగిన ప్రతి దానిపైనా ప్రజల భాషలో రచనలు చేశారు. రాసినట్లుగా జీవించారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావును తెలంగాణ ప్రభుత్వం గొప్పగా గౌరవించింది. తెలంగాణ భాషారంగంలో కృషి చేస్తున్న కవులు, రచయితలను గుర్తించి కాళోజీ పేరిట పురస్కారాలను అందిస్తున్నది. రాష్ట్రంలోనే ఏకైక హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేసి ఆయన పేరు పెట్టింది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్ మహానగరంలో మూడెకరాల్లో కాళోజీ కళా కేంద్రాన్ని నిర్మిస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వయంగా దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే అనేక సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు గొప్ప కేంద్రం కానుంది.
ఆర్య సమాజంలో ఉన్నాడు..
ఆంధ్ర మహాసభలో పని చేశాడు..
గణపతి ఉత్సవాలను నిర్వహించాడు..
కాంగ్రెస్ సత్యాగ్రహాల్లో పాల్గొన్నాడు..
ఆంధ్రసారస్వత పరిషత్తులో ముందున్నాడు
పౌర హకుల కోసం నడుం బిగించాడు..
తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించాడు..
రాజ్యహింస వద్దన్నాడు..
ఏది చేసినా, ఎట్ల చెప్పినా..
కాళోజీ అచ్చమైన మానవతావాది
అసలు సిసలైన ప్రజల మనిషి
ఆయనకు ఏపార్టీలోనూ సభ్యత్వం లేదు
ఏ సంస్థతోనూ సంబంధంలేదు
తామరాకుపై నీటిచుకలా ఉంటాడు..
ఆయన హృదయం కరుణార్ద్ర భరితం
ఎవరికైనా ఏదైనా చిన్న హాని జరిగినా
కడవల కొద్దీ కల్తీలేని కన్నీళ్లు కారుస్తాడు
ఆయన మూర్తీభవించిన కరుణామయుడు
ఆయన ‘నా గొడవ’…సామాజిక సంవేదనకు నిలువుటద్దం.
ఆయన రాసిన కవితలు, కథల్లో
సమాజహితమే కనిపిస్తుంది
ప్రజాకవిగా గుర్తింపు పొందిన కాళోజీని 1972లో భారత ప్రభుత్వం ‘స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించి సన్మానించింది. ‘జీవన గీత’ రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో ఉత్తమ అనువాద రచన అవార్డు ఇచ్చింది. బూర్గుల రామకష్ణారావు మెమోరియల్ అవార్డు వరించింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాళోజీని సన్మానించింది. 1992లో పద్మవిభూషణ్ పురసారం వచ్చింది. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1996లో సహృదయ సాహితి, విశాఖవారి గురజాడ అవార్డు. 1996లో కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురసారం. 1997లో ఉండేల మాలకొండారెడ్డి విజ్ఞానపీఠం అవార్డు. 1996లో నాగపూర్ యూనివర్సిటీ వారి సన్మానం. 2000లో రామినేని ఫౌండేషన్ వారి అవార్డు కాళోజీని వరించాయి.
చెప్పడమే కాదు.. చేసినవాడు..‘పుట్టుక నీది.. చావు నీది… బతుకంతా దేశానిది…’ అని రాయడంతోనే ఆగకుండా ఆచరించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. వెట్టిచాకిరీ, బాల్యవివాహాలు, మద్యపానం, మతాంతీకరణ, దమననీతి, నిరంకుశత్వం, అరాచకత్వాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. తాను గళమెత్తి తన కలంతో ప్రజల్లో చైతన్యం రగిలించారు. 23 ఏళ్ల వయసులోనే స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. హన్మకొండలో ఆర్య సమాజ్ శాఖకు మొదటి అధ్యక్షుడిగా ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. 1939 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు నాలుగు రోజులు వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా తొలిసారి జైలు శిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
1947లోనూ జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు జీవితం గడిపారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత 1948 సెప్టెంబర్ 26న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత, కాళోజీ ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించారు. బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, పౌర హకుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారు. వామపక్ష ఉద్యమం రూపంలో చేసే హింసను వ్యతిరేకించారు. హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని గట్టిగా చెప్పేవారు. ఏదో ఒక పేరుతో ప్రజల ప్రాణాలు తీయడం అంగీకరించబోమని ధిక్కరించారు. స్వతంత్ర భారతదేశం పూర్తి ప్రజాస్వామికంగా మారకపోతే ఏ రాజ్యమైనా ఒకటేగదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఏది కంటకంగా ఉన్నా.. అక్షరాలతో, మాటలతో ఖండిస్తూ ముందుకు సాగారు. జీవిత పోరాటాల అనుభూతులకు మాటలు తొడిగి ప్రజల భాషలో ‘నా గొడవ’ పేరుతో కవిత్వం రాశారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను చాటిచెప్పడంతోనే ఆగకుండా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందుకే కాళోజీ ప్రజాకవిగానే కాకుండా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ‘సమాజంతో సంబంధం లేదనే బతుకు మీరెట్లా బతుకుతారు?, సమాజానికి సంబంధించిన ప్రతిదీ మనకు కావాల్సిందే’నని చెప్పడంతోపాటు పాటించారు.
కాళోజీ జయంతిని పురస్కరించుకొని నేడు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో రాష్ట్రస్థాయి ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు హరిత కాకతీయ హోటల్లో పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. కవి సమ్మేళనం, నాటక ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు హాజరుకానున్నారు. కాగా ఏర్పాట్లపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, నగర కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ హరితహోట్లో శుక్రవారం సమీక్షించారు. కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించాలని, ఆయన చరిత్రను తెలిపేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. కాళోజీ చిత్ర మాలికలతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, వీఆర్ విద్యార్థి, పందిళ్ల అశోక్‌కుమార్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కాళోజీ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, రచనల ఆధారంగా రూపొందిన ‘నా ప్రపంచం -నా కలలు’ నాటక ప్రదర్శన ఉంటుందని నాటక రచయిత, దర్శకుడు డాక్టర్ జీ కుమారస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భాషా సాంసృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హనుమకొండ జిల్లా అధికార యంత్రాగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు హరిత కాకతీయ హోటల్లో నాటకాన్ని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రముఖులు, విద్యావేత్తలు, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరవుతారని, కాళోజీ అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని నిర్వాహకుడు గద్ద తిరుపతి యాదవ్ కోరారు. కాళోజీ ముఖ్య పాత్రలో ప్రముఖ నటుడు శివరాంరెడ్డి నటిస్తుండగా, ప్రశాంత్ గడ్డం సహ దర్శకత్వం, సంగీత్ కుమార్, సందీప్, రోహిత్, అన్నపూర్ణ, గణేశ్, విక్రం, రేవతి, హర్ష వర్ధన్, రాజ్ కుమార్, గని, కుమార్, సిదు ప్రసాద్, రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారని పేర్కొన్నారు.
కాళోజీ నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టహళ్లిలో జన్మించారు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయి. కాళోజీ రంగారావు పూర్వీకులు గతంలో మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు. కాళోజీ రెండో ఏట వాళ్ల కుటుంబం వరంగల్ సమీపంలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. కాళోజీ ప్రాథమిక విద్య మడికొండలో, ఉన్నత విద్య వరంగల్, హైదరాబాద్‌లో సాగింది. న్యాయ విద్య పూర్తి చేసిన ఆయనకు, 1940లో రుక్మిణీబాయితో వివాహమైంది. కాళోజీ 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పని చేశారు. 1952లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో 3,613 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధింపునకు నిరసనగా 1978లో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నిస్వార్థ హృదయం, త్యాగబుద్ధి సొంతమైన కాళోజీ, తోటి స్వాతంత్య్ర యోధుల్లోనూ ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తి. రాజ్య వ్యవస్థను సవాలు చేసిన ధీరుడు. చివరివరకు తన బాటే తనదిగా సాగిన గొప్ప మనిషి. ప్రజా సమస్యలపై నిర్విరామంగా గళమెత్తిన కాళోజీ.. తన మరణానంతరం కూడా ప్రజలకు ఉపయోగపడ్డారు. మరణం తర్వాత ఎల్వీ ప్రసాద్ నేత్ర పరిశోధనా సంస్థకు తన కండ్లను, వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలకు తన భౌతికకాయాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులకు ముందే చెప్పారు.
సాహిత్య పరంగా కీలకమైన ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీల్లో కాళోజీ సభ్యుడిగా వ్యవహరించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ‘అణాకథలు’, ‘నా భారతదేశ యాత్ర’, ‘కాళోజీ కథలు’, ‘పార్థివ వ్యయము’, ‘నా గొడవ’ మొదటి సంపుటం, ‘తుది విజయం మనది నిజం’, ‘నా గొడవ పరాభవ వసంతం’, ‘నా గొడవ పరాభవ గ్రీష్మం’, ‘నా గొడవ పరాభవ వర్షం’, ‘నా గొడవ పరాభవ శరత్తు’, ‘నా గొడవ పరాభవ హేమంతం’, ‘నా గొడవ పరాభవ శిశిరం’, ‘జీవన గీత’, ‘తెలంగాణ ఉద్యమ కవితలు’, ‘నా గొడవ’, ‘నా గొడవ, ఇదీ నా గొడవ’-కాళోజీ ఆత్మకథ, ‘బాపూ! బాపూ!! బాపూ!!!’, ‘అంజలి’, ‘భారతీయ సంస్కృతి’.