వరంగల్, నవంబర్ 2 : నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు విచ్ఛలవిడిగా జరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 50 హోల్‌సేల్ దుకాణాల ద్వారా ప్రతిరోజూ 400 నుంచి 500 టన్నుల ప్లాస్టిక్ అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారుల అంచనా. అయితే, వీటిని కట్టడి చేయాల్సిన బల్దియా అధికారుల వద్ద పక్కా కార్యాచరణ లేకపోవడం.., ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ టాస్క్‌ఫోర్స్ బృందాలు జేబులు నింపుకునే పనిలో ఉండడంతో చారిత్రక వరంగల్ నగరంలో ప్లాస్టిక్ విక్రయాలపై నియంత్రణ కరువైంది.
నిషేధిత ప్లాస్టిక్‌పై బల్దియా అధికారుల నిఘా కరువైంది. నగరంలో యథేచ్ఛగా విక్రయాలు, వినియోగం జరుగుతున్నది. 120 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు విచ్ఛలవిడిగా జరుగుతున్నాయి. బల్దియా అధికారుల హెచ్చరికలను హోల్‌సేల్ వ్యాపారస్తులు బేఖాతర్ చేస్తున్నారు. బల్దియా పరిధిలో నిషేదిత ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు జేబులు నింపుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు వారాల కిత్రం ప్లాస్టిక్ హోల్‌సేల్ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించిన బల్దియా అధికారులకు వ్యాపారస్తులే ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ చూపిస్తే నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు నిలిపివేస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్లాస్టిక్ నిర్మూలనపై బల్దియా అధికారుల వద్ద ఇప్పటి వరకూ పక్కా కార్యాచరణ లేదు. పర్యావరణ పరిరక్షణ అంటూ కబుర్లు చెబుతున్న అధికారులు నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంలో విఫలమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో ప్లాస్టిక్ హోల్‌సేల్ షాపులు సుమారు 50 వరకు ఉండగా, వీటిద్వారా ప్రతిరోజూ 400 నుంచి 500 టన్నుల నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని కట్టడి చేయకపోవడం వెనుక మతలబు ఏంటి? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయనేది బహిరంగ సత్యంగా మారింది. నగరంలో వేల సంఖ్యలో ట్రేడ్లతో పాటు చిరువ్యాపారస్తులు ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్‌ను బహటంగానే వినియోగిస్తున్నారు.
ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నిషేధిత ప్లాస్టిక్ వ్యాపారంపై నిఘా పెట్టాల్సిన బల్దియా అధికారులు కేవలం జరిమానాలతో సరిపెట్టుకున్నారు. ప్లాస్టిక్ విక్రయాలతోపాటు వినియోగిస్తున్న షాపులకు జరిమానాలు విధించడంతోపాటు ట్రేడ్ లెసెన్స్‌లు రద్దు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. కాగా, నిషేధిత ప్లాస్టిక్ నియంత్రణకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు జేబులు నింపుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేశారు. వారంతా పక్కా ప్రణాళిక ప్రకారం జేబులు నింపుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్నది. రోజు పది షాపులకు జరిమానాలు విధించి మరో పది షాపుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ బృందాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా బయోడిగ్రెబుల్ కవర్ల తయారీలో మహిళా సంఘాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మెప్మా సహకారంతో స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇప్పించి, బ్యాంకుల సహకారంతో రుణాలు ఇప్పించి వారిని ప్రోత్సహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బయోడిగ్రెబుల్ ప్లాస్టిక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలు చేయాలి. బల్దియా, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో మార్కెటింగ్ కల్పించాలి. ఇలా చేస్తే మహిళా సంఘాల ఆర్థిక బలోపేతంతోపాటు నిషేధిత ప్లాస్టిక్ నియంత్రణ లక్ష్యం రెండూ నెరవేరుతాయి.